‘దక్షిణాదిలో సినీ హీరోలను ప్రజలు తమ జీవితాల్లో అంతర్భాగంగా చూస్తారు. వారిని ఎంతగానో ఆరాధిస్తారు. అలా ఓ హీరో, అతని అభిమాని నేపథ్యంలో కథ చెప్పాలనిపించింది. ఓ అభిమాని కోణంలో సాగే ఈ కథ చాలా కొత్తగా అనిపిస్తుంది’ అన్నారు మహేష్‌బాబు పి. ఆయన దర్శకత్వంలో రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘ఆంధ్రకింగ్ తాలూకా’ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా సోమవారం చిత్ర దర్శకుడు మహేష్‌బాబు పి విలేకరులతో మాట్లాడారు. ఈ సినిమా కథ 2002లో జరుగుతుంది కాబట్టి ఆంధ్రకింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టామని, కన్నడంలో కూడా ఇదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.
‘ఇదొక ఫ్యాన్ బయోపిక్ అనుకోవచ్చు. చాలా రోజుల క్రితం ఓ సినిమాకు వెళ్లినప్పుడు అక్కడికొచ్చిన అభిమానులు హీరో డైలాగ్‌లకు ఇన్స్పైర్ కావడం చూశాను. ఓ వ్యక్తితో వ్యక్తిగతంగా ఎలాంటి పరిచయం లేనప్పటికీ..అంతలా ఆరాధించడం స్ఫూర్తివంతంగా అనిపించింది. అప్పుడే ఈ కథకు అంకురార్పణ జరిగింది’ అని మహేష్‌బాబు పి చెప్పారు. హీరో రామ్ ఈ కథను సింగిల్సిట్టింగ్లో ఓకే చేశారని, మైత్రీమూవీమేకర్స్ వాళ్లు కూడా కథ విని ఎగ్జయిట్ అయ్యారని తెలిపారు.
‘ఈ సినిమాలో సూపర్‌స్టార్ సూర్య పాత్రలో ఉపేంద్ర కనిపిస్తారు. ఆయనకు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉంటారు. తన పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. మన జీవితంలో ఎవరికో ఒకరికి అభిమానిగా ఉంటాం. అయితే మనం అభిమానించే వ్యక్తి నుంచి ఏం నేర్చుకుంటున్నామనేది చాలా ముఖ్యం. ఈ పాయింట్‌ను సినిమాలో ఆవిష్కరించాం. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దర్శకుడు కృష్ణవంశీకి అభిమానిగా మారాను. ఆయనతో పనిచేసే సందర్భంలో ‘నీకు నేనంటే కాదు సినిమా అంటే ఇష్టం. నీ అభిమానానికి నేనొక టూల్‌గా ఉపయోగపడ్డాను. ఇకపై నువ్వు సినిమానే ప్రేమించాలి’ అని ఆయన చెప్పారు. ఆ మాటలు నన్ను బాగా కదిలించాయి. ఇక వివేక్ మెర్విన్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నది. ఇప్పటికే పాటలన్నీ పాపులర్ అయ్యాయి. ఈ సినిమా కోసం హీరో రామ్ పాటలు రాయడం చాలా ప్రత్యేకం’ అని మహేష్‌బాబు పి ఆనందం వ్యక్తం చేశారు.