సిటీబ్యూరో/మెహదీపట్నం, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరంలోని పలుచోట్ల అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పోలీసింగ్ ఎలా జరుగుతుంది? ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి 12.30గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3గంటల వరకు లంగర్‌హౌస్, టోలిచౌకి పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులు, కీలక జంక్షన్లు, సున్నితమైన ప్రదేశాలను పరిశీలించారు. టోలిచౌకిలోని హోటళ్లు, దుకాణాలను సందర్శించారు.
ముందస్తు సమాచారం లేకుండా, ఎలాంటి సైరన్లు మోగించకుండా.. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆషమ్నగర్, డిఫెన్స్ కాలనీలోని అనేకమంది రౌడీషీటర్ల ఇండ్లకు సజ్జనార్ వెళ్లారు. వారి గత ప్రవర్తన, ప్రస్తుతం వృత్తి జీవనశైలి గురించి ఆరా తీశారు. వారు తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో కూడిన జీవితం గడపాలని, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని సూచించారు. మరోవైపు వ్యాపార సముదాయాలు అనుమతి పొందిన సమయానికి మించి పనిచేయకూడదని హెచ్చరించారు.
తనిఖీ సమయంలో సజ్జనార్ పెట్రోలింగ్ సిబ్బంది, విధుల్లో ఉన్న అధికారులతోనూ వ్యక్తిగతంగా మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. పెట్రోల్ పాయింట్లు, రెస్పాండింగ్ టైమ్స్, సమస్య పరిష్కార ప్రక్రియలను సమీక్షించారు. టోలిచౌకి పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్ జనరల్ డైరీ, నైట్ ఎంట్రీలు, డ్యూటీ రోస్టర్లు, హాజరు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ రాత్రిపూట పోలిసింగ్‌ను పెంపొందించడానికి, సమర్ధవంతమైన సేవలను అందించడానికి నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ కొనసాగించాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ ఆదేశించారు.