హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకేరోజు రెండు ఘటనల్లో ఇద్దరు వృద్ధులు రూ. 1.57 కోట్లకుపైగా సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోయారు. నేరెడ్మెట్ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగికి డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ప్రతినిధినంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఆధార్, సిమ్‌కార్డు ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు, నకిలీ ఏటీఎంలు, బ్యాంక్ అక్రమ లావాదేవీలు జరిగాయని, ముంబై కొలాబా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని బెదిరించాడు.
మీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని, ఖాతాలో ఉన్న డబ్బును తాము సూచించిన ఖాతాలోకి పంపించాలని, విచారణ అనంతరం సొమ్ము తిరిగి వస్తుందని నమ్మించారు. వారి మాటలు నమ్మి బాధితుడు రూ. 68.8 లక్షలు వివిధ ఖాతాలకు బదిలీ చేసి మోసపోయాడు. మరో ఘటనలో అదే ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగికి ఫోన్ చేసిన సైబర్‌నేరగాళ్లు మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ బెదిరించి రూ. 88.8 లక్షలు కాజేశారు. మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.