కార్వాన్, ఆగస్టు 23: అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఫర్నిచర్ గోదాంలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కార్వాన్ మొగల్ కా నాలా రోడ్డులోని ఏకె ఫంక్షన్ హాల్ వెనుక వైపు పెద్ద ఎత్తున ఫర్నిచర్ గోదాంలు ఉన్నాయి. ఇదే వరుసలో కొన్ని ఇతర వస్తువుల గోదాంలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో మూడు ఫర్నిచర్ గోదాంలతో పాటు వీటి పక్కనే ఉన్న డైపర్లు నిల్వ చేసి ఉంచిన గోదాం కూడా పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో కేవలం ఆస్తి నష్టం జరిగింది.
ఈ అగ్ని ప్రమాదంలో గోదాంలలో నిల్వ ఉన్న ఫర్నిచర్‌తో పాటు వాటి కోసం ఉపయోగించే ముడి సరుకు, రవాణా కోసం ఉపయోగించే రెండు ఆటో ట్రాలీలు, రెండు ద్విచక్ర వాహనాలు, మరో ట్రాన్స్పోర్ట్ వాహనం కూడా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 5 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు.