హనుమకొండ, ఆగస్టు 23 : కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచైనా నూతన పీఆర్సీ, పెండింగ్ డీఏలు విడుదల చేయిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిషారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవసరమైతే ప్రభుత్వంతో పోరాడుతామని తెలిపారు. రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలో 2కే రన్ నిర్వహించారు. ఏకశిల పార్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నిర్వహించిన ఈ రన్లో ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువత, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓరుగల్లు కేంద్రంగా ప్రారంభమైన ఏ ఉద్యమం ఓడిపోలేదని, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల ఉద్యమం కూడా ఓడిపోదని తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, జీవో 97ను తక్షణమే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ గ్రాట్యూటీ, పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించాలని, ఆశ, అంగన్వాడీ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, హోంగార్డులు, లైసెన్స్ సర్వేయర్లు, 104, 108 సిబ్బంది సమస్యలను పరిషరించాలని కోరారు.
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత.. రేవంత్‌రెడ్డి చిట్టా విప్పుతానని అంటున్నారని, త్వరగా బయట పెట్టాలని రాకేశ్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికి నుంచీ పంపకాల గొడవలు, ఫ్యామిలీ, పదవుల గొడవలు తప్ప ప్రజల గోడు పట్టించుకొనే వారే లేరని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరులకు దోచిపెట్టడానికి, ఢిల్లీకి మూటలు మోయడంలో ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓట్లు వేసిన ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమంపై లేదని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్స్‌లు పెంచుకొనేందుకు నిధులుంటాయి, కానీ పీఆర్సీ, డీఏలు ఇచ్చేందుకు నిధులు లేవా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు రామస్వామి, సదానందం తదితరులు పాల్గొన్నారు.