హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ క్రాప్ సర్వే ఎన్యుమరేటర్లను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. రాష్ట్రంలో ఒక్కో ఫామ్ చొప్పున ఫీల్డ్ సర్వే చేసినందుకు రూ.7 మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. ఈ సర్వేకు రూ.10 ఇవ్వాలని కేంద్రం నిర్ణయించగా, తెలంగాణలో రూ.3 తక్కువగా చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో రూ.10 చెల్లిస్తుండటం గమనార్హం. వాస్తవానికి ‘డిజిటల్ క్రాప్ సర్వే’ (డీసీఎస్) కేంద్ర ప్రభుత్వ పథకం. పంట సాగు లెక్కలు పక్కాగా సేకరించేందుకు దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తున్నది. ఇందుకయ్యే ఖర్చులో అత్యధిక మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. దీంతో ఒకే పథకం అమలుకు రెండు రాష్ర్టాల్లో చెల్లింపుల్లో వ్యత్యాసం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డీసీఎస్ కోసం తాత్కాలిక పద్ధతిలో 9,500 మంది ఎన్యుమరేటర్లను వ్యవసాయ శాఖ నియమించుకొన్నది. ఇప్పటికే వీరికి శిక్షణ ఇచ్చింది. పలుచోట్ల ఎన్యుమరేటర్లు సర్వే మొదలుపెట్టారు. వీరికి ఒక్క సర్వే నంబర్లో ఒక రైతుకు సంబంధించిన పంట వివరాలు ఫొటోతోపాటు నమోదు చేసినందుకు రూ.7 చెల్లిస్తున్నది. ఇలా రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. మొత్తం సర్వే చేయడానికి డీసీఎస్ కింద ఎన్యుమరేటర్లకు సుమారు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం చెప్పినట్టుగా, ఏపీలో చెల్లిస్తున్నట్టుగా ఒక సర్వేకు రూ.10 చెల్లిస్తే రూ.7 కోట్లు అవుతుంది. తెలంగాణలో రూ.3 తగ్గించడం వల్ల ఎన్యుమరేటర్లకు చెల్లింపులో రూ.2 కోట్ల తేడా వస్తున్నది. దీంతో మిగతా రూ.2 కోట్లు ఏమవుతున్నాయి? ఎవరికి పోతున్నాయి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏఈవోలు, ఎన్యుమరేటర్లకు డీసీఎస్ తలనొప్పిగా మారింది. ముందుగా సర్వే పూర్తికి వ్యవసాయ శాఖ 45 రోజుల గడువు ఇచ్చింది. రెండు రోజుల కిందట ఆ గడువును తగ్గించిందని, మార్చి 15లోగా పూర్తి చేయాలని అంతర్గత ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. దీంతో ఏఈవోలు, ఎన్యుమరేటర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లకు పెద్ద ఇబ్బందిగా మారింది.
సర్వే కోసం వినియోగించే యాప్ నిర్వహణతోపాటు సర్వర్ ఖర్చుల కోసమే రూ.3 తక్కువగా చెల్లిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఏపీలోనూ ఇదే విధానం అమలు చేస్తున్నప్పుడు, అక్కడెందుకు యాప్, సర్వర్ ఖర్చులు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యాప్ ఖర్చులన్నీ కేం ద్రమే భరిస్తుండగా, మరి కేంద్రం యాప్ను వినియోగిస్తూ నిర్వహణ కోసమంటూ తమకు రూ.2 కోట్ల మేర ఎందుకు దగా చేస్తున్నారని ఎన్యుమరేటర్లు మండిపడుతున్నారు.