కారేపల్లి, సెప్టెంబర్ 19 : మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆంబులెన్స్ లో తరలిస్తున్న డయాలసిస్ పేషెంట్ మార్గ మధ్యలో మృతి చెందిన సంఘటన శుక్రవారం సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రేపల్లె వాడకు చెందిన లకావత్ లోక్యా (50) శుక్రవారం ఉదయం ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేపించుకుంటుండగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన భార్యతో పాటు సోదరుడి కూతురు అత్యవసర వైద్యం కోసం ఆక్సిజన్ అమర్చి అంబులెన్స్ లో కారేపల్లి మీదుగా ఖమ్మం తీసుకెళ్తున్నారు.
కారేపల్లి మండల కేంద్రానికి అంబులెన్స్ చేరుకోగా లోక్యా నోట్లో నుండి నురుజు రావడంతో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. దీంతో మండల వైద్యాధికారి బి.సురేశ్ రోగి పల్స్, బీపీ పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. మరల అదే అంబులెన్స్ లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకువెళ్లారు.