ఖైరతాబాద్, నవంబర్ 25 : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఖైరతాబాద్‌లోని బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో కార్పొరేటర్ పి.విజయారెడ్డి, సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తా కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ వనం సంగీత యాదవ్‌తో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పేద కుటుంబంలో ఆడపిల్లల పెండ్లి చేయాలన్నా ఆర్థిక స్థోమత లేని కారణంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రహించిన సీఎం కేసీఆర్ ఈ పథకాలను తీసుకొచ్చారన్నారు.
రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఇతర రాష్ర్టాల వారు ఆదర్శంగా తీసుకొంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం సుమారు రూ.20 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రాష్ట్రంలో త్వరలోనే ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు అందుకు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విశేష కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమాల్లో ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, సోమాజిగూడ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కె అహ్మద్, పి. నాగరాజు, నాయకులు గజ్జెల అజయ్, వనం శ్రీనివాస్ యాదవ్, సలావుద్దీన్, మహేశ్ యాదవ్, కరాటే రమేశ్, శ్రీనివాస్ యాదవ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.