హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పరిపాలనారంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్‌ను ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా ఇవాళ బీఆర్కే భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల సీనియర్ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉద్యోగసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ధరణి ఒక ఏడాది కాలంలో సాధించిన విజయాలను తెలిపే ప్రత్యేక బుక్‌లెట్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి పోర్టల్ ఆవిష్కరణ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృఢసంకల్పం వల్లనే సాధ్యమైందన్నారు. ఏడాది కాలంలో ధరణి ఊహించిన దానికంటే విజయవంతమైందని చెప్పారు. పోర్టల్‌ను 5.14 కోట్ల మంది దర్శించడమేగాక, పది లక్షలకుపైగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగడమే అందుకు నిదర్శనమన్నారు.
కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న పలు విప్లవాత్మక పథకాలవల్ల రాష్ట్రంలో భూముల ధరలు ఒక్కసారిగా నాలుగైదు రెట్లు పెరిగాయని సీఎస్ చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల ప్రస్తుతం రికార్డులను తారుమారు చేసే పరిస్థితులు లేవని, రాష్ట్రంలో ఏవిధమైన భూ వివాదాలు తలెత్తడం లేదని సోమేశ్ కుమార్ స్పష్టంచేశారు. గతంలో కేవలం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగాయని, ధరణి ప్రారంభం అనంతరం వీటికి అదనంగా 574 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని గుర్తుచేశారు.
ధరణి విజయవంతంగా కొనసాగడానికి ముందు ఎంతో మంది సీనియర్ అధికారులు వందలాది మంది ఐటీ నిపుణులు శ్రమించిన విషయాన్ని సీఎస్ గుర్తుచేశారు. ఈ సందర్బంగా ధరణి పోర్టల్ రూపకల్పనలో భాగస్వాములైన అధికారులు తమ అనుభవాలను వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ ఎండీ జీటీ వెంకటేశ్వర్ రావు, పంచాయతీరాజ్ కమిషనర్ ఏ శరత్, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారిణి సత్య శారద ఇతర అధికారులు పాల్గొన్నారు.