యాదాద్రి, డిసెంబర్ 16: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం బాలాలయ మండపంతోపాటు పాతగుట్ట ఆలయంలో అర్చకులు వేద మంత్రాల మధ్య అమ్మవార్లకు తిరుప్పావై పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ధనుర్మాస విశిష్ఠతను భక్తులకు వివరించారు. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుందని, ఈ మాసంలో భక్తులు ఆలయాలను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని తెలిపారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను రోజుకొకటి చొప్పున 30 రోజులపాటు పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు నిర్వహిస్తారని ఆలయ ప్రధానార్చకులు నల్లందీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు తెలిపారు.