యాదాద్రి, డిసెంబర్ 5 : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో స్వామివారి ప్రాంగణం కోలాహలంగా మారింది. ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో స్వామివారికి ఆరాధనలు ప్రారంభించారు. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు లక్ష్మీసమేత నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలతో అర్చించి సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. నవగ్రహాలకు తైలాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీవారి ఖజానకు ఆదివారం రూ. 22,69,332 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్నఅటవీశాఖ ప్రధాన కార్యదర్శి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈఓ ఎన్. గీత స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
కలిసొచ్చిన కార్తిక మాసం
స్వామివారికి ఈ కార్తిక మాసం భారీ ఆదాయన్ని సమకూర్చింది. గత రెండేళ్ల కంటే ఈసారి సుమారుగా రూ.2 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. 2019తోపాటు 2020లోనూ కరోనా ప్రభావంతో కార్తిక మాసంలో ఆలయానికి ఆశించినంతగా ఆదాయం సమకూరలేదు. ఈ ఏడాది కొవిడ్ ప్రభావం అంతగా లేకపోవడంతో సత్యానారాయణ వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. కార్తిక మాసం ఆదాయ వివరాలను ఆలయ అధికారులు ఆదివారం విడుదల చేశారు. 2019లో రూ.5,49,51,571, 2020లో రూ.5,74,44,817, 2021లో రూ.7,35,10,307 ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు. కార్తిక మాసం వ్రతాల సంఖ్య 2019లో 18,277, 2020లో 15,788, 2021లో 19,204 ఉన్నట్లు తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 3,91,332
వీఐపీ దర్శనాలు
సుప్రభాతం 1,000
వేద ఆశీర్వచనం
క్యారీబ్యాగుల విక్రయం 8,250
ప్రచారశాఖ 38,500
వ్రత పూజలు 8,250
కల్యాణకట్ట టిక్కెట్లు 32,600
ప్రసాద విక్రయం 7,81,120
వాహన పూజలు 13,116
టోల్గేట్ 2,660
అన్నదాన విరాళం 59,579
సువర్ణ పుష్పార్చన 1,29,260
యాదరుషి నిలయం 1,01,770
పాతగుట్ట నుంచి 55,579
గోపూజ 400
ప్రచారశాఖ 24,500