ఖమ్మం రూరల్: నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజించి అనేక అభిషేకాలు, హోమాలు నిర్వహించి తీరక నైవేద్యం సమర్పించిన భక్తులకు గణేష్ నిమజ్జనం అనంతరం తీవ్ర ఆవేదనలో ఉన్నారు. శనివారం సాయంత్రం నుంచి ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట మున్నేటిఘాట్లో నిమజ్జన ప్రక్రియ జరిగింది. ఈ నిమజ్జనంలో మున్సిపాలిటీకి చెందిన 60 మంది పారిశుధ్య కార్మికులు 15 మంది అధికారులు 32 మంది గజ ఈతగాళ్లు నిరంతర పర్యవేక్షణకు జిల్లా సంక్షేమ అధికారితో పాటు మండల అధికారులను సైతం ఏర్పాటు చేశారు. గణనాథుల నిమజ్జనంకు మూడు భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు.
అర్ధరాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ కొనసాగింది. అయితే గణనాథుల నిమజ్జనంలో సిబ్బంది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నీటిలో మునగాల్సిన గణనాథులు ఆదివారం నది ఒడ్డున కనిపించడంతో అటువైపుగా ప్రయాణం చేసిన భక్తులు మన్నించు మహాదేవ అనుకుంటున్న సందర్భం కనపడింది. భారీ క్రేన్లు గజ ఈతగాళ్లు ఉన్నప్పటికి సరిగా నిమజ్జనం చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఒడ్డున ఉన్న విగ్రహాలను పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యేలా చూడాలంటున్నారు.