వనస్థలిపురం, మే 17 : ‘నా బూత్ నా బాధ్యత’ పేరుతో బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం పండుగలా సాగింది. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురం జీఎస్సార్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అన్ని డివిజన్ల నుంచి బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు సాగింది. నాయకులు కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో చివరి వరకు వక్తల ప్రసంగాలు విని రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వెళ్లారు. ఆద్యంతం జై తెలంగాణ నినాదాలతో జీఎస్సార్ గార్డెన్స్ మార్మోగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం క్యాడర్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని నింపింది.

సభా మధ్యన ఏర్పాటు చేసిన ర్యాంపు పై నుంచి హాల్లోకి ప్రవేశించిన కేటీఆర్ అభిమానులు, కార్యకర్తలతో కరచాలనం చేస్తూ వచ్చారు. ర్యాంపు పై నడుస్తూనే ప్రసంగించారు. శిక్షణ కార్యక్రమం ముగింపులో సుమారు రెండు గంటల పాటు కార్యకర్తలతో ఫొటోలు, సెల్ఫీలు దిగడంతో క్యాడర్లో మరింత జోష్ పెరిగింది. కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని రహదారులు ప్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయాయి. నాయకులు పోటీ పడి మరీ కేటీఆర్‌కు స్వాగత బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు వక్తల ప్రసంగాలు నడిచాయి.

మధ్యాహ్నం భోజనం తర్వాత కేటీఆర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య, బేవరేజస్ కార్పొరేటర్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నాయకుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, అప్పుడే ప్రజల మన్ననలు పొందుతారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద వ్ అన్నారు. పదవులు రాగానే మారిపోతే ప్రజలు మనల్ని మార్చేస్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో శాశ్వతంగా ఉండే పార్టీ అన్నారు. తెలంగాణను సాధించి, బంగారు తెలంగాణను నిర్మించిన పార్టీ అన్నారు. అలాంటి పార్టీలో కార్యకర్తగా, నాయకుడిగా ఉండడం గర్వకారణమన్నారు. గతంలో ఎల్బీనగర్ ఎలా ఉండేది, బీఆర్ఎస్ పాలనలో ఎల్బీనగర్ను ఎలా అభివృద్ధి చేశామన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

వందల కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, స్కైఓవర్లు నిర్మించిన ఘనత కేసీఆర్, కేటీఆర్, సుధీర్‌రెడ్డిలకు దక్కుతుందన్నారు. అయినా కార్పొరేటర్లు ఓడిపోవడం బాధాకరమన్నారు. క్షేత్రస్థాయిలో మనం చేసిన పనులు చెప్పడం బూత్ స్థాయి కార్యకర్తల కర్తవ్యమన్నారు. కేసీఆర్ కాళేశ్వరం, సచివాలయం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాడన్నారు. రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిన రేవంత్‌రెడ్డి ఏం నిర్మించాడని, ఎవరికి మేలు చేశాడని ప్రశ్నించారు. దేశంలోనే ప్రజలతో చెప్పరాని తిట్లు తిన్న సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. త్వరలో ఎస్ఐఆర్ ప్రారంభం అవుతుందని, బూత్ స్థాయి నాయకులు అందులో భాగస్వాములు కావాలని సూచించారు.
రాజకీయ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే పట్టుగొమ్మలని, నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలని మాజీ మం త్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి ప్రజా సమస్యలు నేరుగా తెలుస్తాయన్నారు.

వారి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా బూత్ లెవల్ క్యాడర్‌పై ఉందన్నారు. శిక్షణలో నేర్చుకున్నదాన్ని ఆయా ఏరియాల్లో చూపించాలని సూచించారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని క్యాడర్ మరింత చిత్తశుద్ధితో పనిచేయాన్నారు.
ఇప్పుడు సమాజంలో జరుగుతుంది జ్ఞాన పోరాటమని, బీఆర్ఎస్ క్యాడర్ ఆ పోరాటం లో ముందుండాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఎల్బీనగర్లో జరిగిన నా బూత్.. నా బాధ్యత శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టడంతోపాటు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రచారం చేయాలన్నారు.

మన వద్ద సరైన జ్ఞానం ఉన్నప్పుడే ఇతరులను ఎదుర్కొగలుగుతామన్నారు. బూత్ స్థాయి కార్యకర్తల్లో ఆ విషయాలను పెంపొందించే లక్ష్యంతోనే శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయ డం జరుగుతుందన్నారు. ప్రజల్లో హుందాగా ఉండాలని, సేవా నిరతి, త్యాగనిరతిని కలిగి ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని, తద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రతి కార్యకర్త యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ఎంతో శక్తివంతమైనదన్నారు.
నేటి తరానికి తెలంగాణ ఉద్యమ చరిత్రను వివరించాలని, ముందుగా కార్యకర్తలు తెలుసుకోవాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. 1962 నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం, బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై శిక్షణ శిబిరంలో ప్రసంగించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 60 ఏళ్లు తెలంగాణ నేలపై రక్తం పారిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ నేలపై నీళ్లు పారాయన్నారు.

కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి పోరాటం చేశాడన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో కలిసి వచ్చారన్నారు. వందలాదిగా విద్యార్థులు బలిదానమయ్యారన్నారు. తెలంగాణ అమరవీరులను బలితీసుకున్నది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. తెలంగాణ ఉద్యమం, సంస్కృతిని పాటలతో వివరించారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త మొక్కవోని ధైర్యంతో పనిచేయాలని, కేసీఆర్‌ను తిరిగి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.