
బాల్కొండ(ముప్కాల్), డిసెంబర్ 10: సీఎం కేసీఆర్ సహకారంతోనే బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండలో రూ.పది లక్షలతో పోచమ్మగల్లీ నుంచి ప్రైమరీ పాఠశాల వరకు, రూ.44లక్షలతో మూడు బొమ్మల నుంచి సాపిల్ కట్ట మీదుగా జీపీ వరకు, రూ.13లక్షలతో ఎంకే ఫంక్షన్ హాల్ వెనుక చేపట్టే లింకు రోడ్డు పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 50 ఏండ్లుగా బాల్కొండ ప్రజలు అభివృద్ధి జరుగక నానా ఇబ్బందులు పడ్డారని, తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అభివృద్ధికి కృషిచేస్తున్నానని చెప్పారు. కావాల్సిన అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌కు వివరించి రూ.13 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నట్లు తెలిపారు. అభివృద్ధి ప్రజల కండ్ల ముందు ఉన్నదని, కత్తి, నెత్తి లేని వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. కేసీఆర్ సీఎం కాకముందు రోడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం ఎలా ఉండేది..? ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. అనంతరం ముప్కాల్‌లో పద్మా మహేశ్ ఫిల్లింగ్ స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్యా లింగాగౌడ్, జడ్పీఈసీ దాసరి లావణ్యా వెంకటేశ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్‌యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్ బూస సునీత, ఎంపీటీసీ కన్న లింగవ్వ పోశెట్టి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, ఉపసర్పంచ్ వాహబ్, కో-ఆప్షన్ సభ్యుడు ఫయాజ్ అలీ, టీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కమటీ సభ్యుడు తౌటు గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.