బన్సీలాల్‌పేట్, జనవరి 29 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కె.హేమలత, జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, సికింద్రాబాద్ తాసీల్దార్ బాలశంకర్, జలమండలి జీఎం రమణారెడ్డితో కలిసి బన్సీలాల్‌పేట్ డివిజన్లో రూ.3.43 కోట్లతో 12 అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు బస్తీల్లో స్థానికులు పటాకులు కాల్చుతూ ఘనస్వాగతం పలికారు. మంత్రి, కార్పొరేటర్లకు శాలువాలు కప్పి సన్మానించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా బోయిగూడలోని డాన్‌బాస్కో హాస్టల్ వద్ద పార్కులో వాకింగ్ ట్రాక్, ప్రహరీ నిర్మాణ పనులు, సున్నం బట్టిలో పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవని చెప్పడంతో త్వరలోనే వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గొల్లకొమరయ్య కాలనీ నుంచి ఐడీహెచ్ కాలనీ వరకు వీడీసీసీ రోడ్డు, జయప్రకాశ్‌నగర్, జీకే కాలనీల్లో నూతన డ్రైనేజీ పనులు, భోలక్‌పూర్ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద, మేకలమండి వెనకాల వీడీసీసీ రోడ్డు, హనుమాన్ దేవాలయం వద్ద తాగునీటి పైపులైన్ పనులను మంత్రి ప్రారంభించారు. తాగుబోతులు ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పెట్రోలింగ్ పెంచాలని గాంధీనగర్ సీఐ మోహన్‌రావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఇన్చార్జి జి.పవన్‌కుమార్ గౌడ్, అధ్యక్షుడు వెంకటేశన్రాజు, నాయకులు కె.లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, లంకరాజు, ముక్కశ్రీను, జీకే కాలనీ అధ్యక్షుడు కెఎం.కృష్ణ, కార్యదర్శి నర్సింగ్‌రావు, వివిధ బస్తీలు, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.