శామీర్పేట, ఫిబ్రవరి 18 : హైడ్రా బృందాన్ని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దేవరయాంజాల్ 13వ వార్డులో రోడ్డు సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణ దళిత సమాఖ్య రాష్ర్ట అధ్యక్షుడు బీఎన్.రామ్మోహన్ డిమాండ్ చేశారు. తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్ 13వ వార్డులోని దళితవాడలో రోడ్డు సమస్యపై దళిత సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాడు చేశారు.
దీంతో హైడ్రా బృందం దేవరయాంజాల్కు చేరుకుని దళితవాడలకు ఇబ్బందికరంగా ఉన్న తిరుమలకాలనీ ప్రహారి గోడ, రోడ్డుల విషయాన్ని పరిశీలించారు. కాలనీవాసులు హైడ్రా బృందాన్ని అడ్డుకోవడంతో తూతూ మంత్రంగా కూల్చివేతలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మిగిలిన గోడను కూల్చి వేసి దళిత వాడలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని తెలిపి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణ దళిత సమాఖ్య సభ్యులు, దళితవాడ వాసులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫిర్యాదుపై సమస్య పరిష్కారం చూపకుండా తూతూ మంత్రంగా కూల్చివేతలు నిర్వహించిన అధికారులు, అధికారులను అడ్డుకున్న వారికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దళితులకు స్వేచ్ఛలేదనే విధంగా రోడ్డు మార్గాన్ని ఉపయోగించరాదనే విధంగా వ్యవహరిస్తున్న తిరుమల కాలనీ వాసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుని దళిత వర్గాల, ప్రజల మనోభావాలకు భంగం కలుగకుండా చూడాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ను కలిసి తమ సమస్యను పరిష్కరంచాలని కోరారు.