హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉతంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అధికార కాంగ్రెస్ నుంచి ఎదురైన సవాళ్లు, అడ్డంకులను అధిగమిస్తూ కారు పార్టీ తన సత్తా చాటుకున్నది. మొత్తం 116 పురపాలికలకు గాను ఇప్పటికే వెల్లడైన 105 మున్సిపాలిటీల్లో 18 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. మూడు పురపాలికల్లో ఇండిపెండెంట్లు, ఒక్కో మున్సిపాలిటీ చొప్పున బీజేపీ, ఏఐఎఫ్బీ దక్కించుకోగా, మిగతా 82 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుచుకున్నట్టు సోమవారం సీఈసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 116 పురపాలికల్లో చైర్పర్సన్ల ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల వ ల్ల 11చోట్ల వాయి దా పడింది. ఆయాచోట్ల మంగళవారం జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
తాజా సమీకరణాల ప్రకారం వాటిలో కనీసం 8 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకొనే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ ఖాతాలో మరిన్ని పురపాలికలు చేరనున్నాయి. అధికార పార్టీ వ్యూహాలను తట్టుకొని బీఆర్ఎస్ 18 చోట్ల మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. ఇక మిగతా మున్సిపాలిటీల ఫలితాలు కూడా వెలువడితే, పూర్తిస్థాయి మున్సిపల్ చిత్రం స్పష్టంకానున్నది.

రాష్ట్రంలో మూడు మున్సిపాటీలను స్వతంత్రులు సొంతం చేసుకున్నారు. ఆదిలాబాద్, మహబూబాబాద్, భైంసా పురపాలికల్లో సత్తాచాటి అధ్యక్ష పీఠాలు దక్కించుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా అనూష బండారి(స్వతంత్ర), వైస్ చైర్‌పర్సన్‌గా మహ్మద్ రోహత్(ఎంఐఎం), మహబూబాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జ్యోతి గుగులోత్(స్వతంత్ర), డిప్యూటీ చైర్‌పర్సన్‌గా సుర్నపు సోమయ్య(సీపీఎం), భైంసా చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్లుగా ఇండిపెండెంట్లు తుమోళ్ల దత్తాత్రి, బీబీ ఖతీజా సిద్ధిఖీ ఎన్నికయ్యారు.
ఇక ఏఐఎఫ్బీ ఒకచోట, బీజేపీ మరోచోట చైర్పర్సన్ పీఠాలను గెలుచుకున్నాయి. నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకున్నది. చైర్‌పర్సన్‌గా కొండా శ్వేత, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఎన్ మంజుల, వడ్డేపల్లి పురపాలిక చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ స్థానాలను ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) అభ్యర్థులు మంజుల, ఆర్ సారంద ఎన్నికయ్యారు..
ఏడు ప్రధాన నగరపాలికల ఫలితాలను పరిశీలిస్తే ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారు. రెండు కార్పొరేషన్లలో బీజేపీ, సీపీఐ ఒకటి చొప్పున కైవసం చేసుకున్నాయి. మిగిలిన ఐదు చోట్ల అధికార కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని మూడ్ గణేశ్(సీపీఐ), డిప్యూటీ మేయర్‌గా జూపల్లి రమేశ్‌బాబు(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. కరీంనగర్ మేయర్‌గా బీజేపీ అభ్యర్థులు కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా యాదగిరి సునీల్‌రావు ఎన్నియ్యారు. మిగతా ఐదు చోట్ల అధికార కాంగ్రెస్ అభ్యర్థులు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు.
