జనగామ, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం.. గూండాయిజానికి దిగారు. చైర్మన్ పీఠాన్ని గెలుచుకునేంత సంఖ్యాబలం లేని కాంగ్రెస్ నాయకులు ఒంటరిగా మెజారిటీ సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపేందుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ శిబిరం నుంచి 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మద్దతు తెలిపిన ఇద్దరు స్వతంత్రులతో కలిసి సోమవారం ఉదయం 8 గంటలకు జనగామకు బయలుదేరారు. వారి ప్రత్యేక బస్సును అడుగడుగునా అడ్డుకొని సభ్యులను ఎత్తుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు గూండాలు, రౌడీషీటర్లను పురమాయించారు.
బీఆర్ఎస్ సభ్యుల బస్సు జనగామ చేరుకోగానే వేలాదిగా తరలివచ్చిన గులాబీ సైనికులు పట్టణ శివారులో వారికి స్వాగతం పలికి వాహనానికి రక్షణగా ముందు నిలిచారు. తొలుత జనగామ చౌరస్తాలో ముందుకు వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లతో అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వాహనాలను అడ్డుపెట్టి అడ్డంకులు సృష్టించారు. ఆ తర్వాత ఆర్అండ్బీ అతిథిగృహం చౌరస్తా వద్ద జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ భారీ ఎత్తున పోలీసు బలగాలతో మరోసారి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రయాణిస్తున్న బస్సును అడ్డగించారు. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను కిడ్నాప్ చేశారని, ఆమె సమీప బంధువు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైన దృష్ట్యా ఆమెను విచారించాలని అన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కిడ్నాప్ అయిందన్న అభ్యర్థిని పిలిచి బస్సులోంచి డీసీపీతో మాట్లాడించారు.
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను బీఆర్ఎస్ బీ-ఫారంపై గెలిచి భర్త అనుమతితో శిబిరంలో ఉన్నానని, తప్పుడు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని సదరు అభ్యర్థి స్పష్టంచేసింది. అయినప్పటికీ వినకుండా డీసీపీ రాజమహేంద్రనాయక్ సహా పోలీసులు ముస్లిం మైనారిటీ మహిళా కౌన్సిలర్‌పై దురుసుగా ప్రవర్తించి అవమానకరంగా వ్యవహరించారు. దీంతో డీసీపీ తీరును ఎమ్మెల్యే పల్లా తీవ్రంగా వ్యతిరేకించారు. డీసీపీ తీరుపై డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి ఎమ్మెల్యే పల్లా ఫోన్లో ఫిర్యాదు చేశారు.
ప్రజాసామ్యాన్ని ఖూనీ చేశారని, ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు, పోలీసులు కాంగ్రెస్ గూండాలతో కుమ్మక్కై ఎన్నిక వాయిదా వేయించారని ఆరోపిస్తూ.. జనగామ ఆర్డీవో, డీసీపీ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఇద్దరు స్వతంత్రులు కలిసి మున్సిపల్ కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారం ముందు మెట్లపై కూర్చొని నిరసనకు దిగారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని మైనారిటీ కౌన్సిల్ అభ్యర్థి సహా ఆమె భర్తతో ఎమ్మెల్యే పల్లా మీడియాతో మాట్లాడించారు.
మెజారిటీ సభ్యుల మద్దతు ఉండి సభ్యులంతా హాజరైనప్పటికీ తప్పుడు కేసును చూపి ఎన్నికను అడ్డుకున్నారని, అధికారులు సైతం వత్తాసు పలికి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.