కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్( Deputy Tahsildar) నవీన్ కుమార్తో పాటు కార్యాలయంలో తండ్రి స్థానంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న అంజి అనే యువకుడు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB ) అధికారులకు చిక్కారు.
కోటపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భీమారానికి చెందిన గంట నరేష్ తన తండ్రికి చెందిన 20 గుంటల భూమికి పాస్ పుస్తకం కోసం మీసేవ లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇదే విషయమై తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా సంబంధిత అధికారి, సిబ్బంది రూ.15వేలు లంచం డిమాండ్ చేసి రూ. 10వేలకు ఒప్పందం చేసుకున్నారు.
బాధితుడు నరేష్ ఏసీబీని ఆశ్రయించగా రంగంలోకి దిగిన అధికారులు శుక్రవారం రూ.10వేల లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహశీల్దార్ నవీన్ తో, అటెండర్ అంజిని పట్టుకున్నారు. లంచం తీసుకున్నందుకు ఇద్దరిని అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.