హైదరాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వ పాలనపై 50 శాతానికిపైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అంటే మిగిలిన 50% మంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు ఆయన పరోక్షంగా అంగీకరించారు. తమ పాలనపై 100% ప్రజలు సంతోషంగా ఉంటారని అనుకోవడంలేదని వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో ఆ యన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు రుణమాఫీ, రైతుభరోసా కన్నా సన్నాలకు ఇస్తున్న బోనస్‌తోనే ఎక్కువ ప్రయోజనం కలుగుతున్నదని తెలిపారు. సంక్రాం తి నుంచి రైతుభరోసా అమలుచేస్తామని వెల్లడించారు. 14 నుంచి గురుకుల హాస్టల్స్‌లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు భోజనం చేస్తారని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలవలేదని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిష్ఫలంగా ముగిసింది. ఇటు పార్టీ అధిష్ఠానం నుంచి గానీ, అటు కేంద్రం నుంచి గానీ ఎలాంటి హామీలు లేకుండానే ఆయన ఉట్టి చేతులతో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో రూ.10 వేల కోట్ల రుణానికి, భూమి తనఖా పెట్టి అప్పు తీసుకొనేందుకు అనుమతి కోరాలని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించాలని, తెలంగాణకు రావాల్సిన, నిధులు, గ్రాంటు విడుదల వంటి అంశాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వద్ద ప్రస్తావించాలని భట్టి భావించినట్టు తెలిసింది. ఇందుకోసం రెండు రోజులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే ఆమె అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం రాహుల్‌గాంధీ కూడా భట్టిని కలువలేదని సమాచారం. నిజానికి ఆయన భట్టిని కలవడానికి ఆసక్తి చూపించలేదని తెలిసింది. ఇటు పార్టీ పెద్ద రాహుల్‌ను కలువకుండా, ఆటు ఆర్థిక మంత్రి నిర్మలతోనూ భేటీకాకుండా ఉట్టిచేతులతో భట్టి భాగ్యనగరం చేరినట్టు చెప్పుకుంటున్నారు.