హనుమకొండ , అక్టోబర్ 30: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సైన్స్పట్ల ఆసక్తిని కలిగించడానికి చెకుముకి సైన్స్సంబురాలు ఎంతగానో తోడ్పడతాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిణి డి.వాసంతి అన్నారు. చెకుముకి సైన్స్సంబురాల పోస్టర్లను గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో వాసంతి మాట్లాడుతూ జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్సంబురాల విజయవంతానికి అన్ని మండలాల విద్యాశాఖాధికారులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోడ్పాటునందించి విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జనవిజ్ఞానవేదిక హానుమకొండ జిల్లా అధ్యక్షులు కాజీపేట పురుషోత్తం మాట్లాడుతూ చెకుముకి సైన్స్సంబురాలు పాఠశాలస్థాయిలో 7న, మండలస్థాయిలో 21న, జిల్లాస్థాయిలో 28న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ర్ట చెకుముకి ఇన్ఛార్జి, నిట్ విశ్రాంత ఆచార్యులు కె.లక్షారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు, పరిశీలనశక్తిని పెంపొందించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం ద్వారా శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడేవిధంగా ఈ సైన్స్సంబురాల కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామంచ బిక్షపతి, ఆర్థిక కార్యదర్శి పరికిపండ్ల వేణు, ఉమామహేశ్వరరావు, వకుళాభరణం శ్రీనివాస్, బోయినపల్లి మహేష్రావు ఉన్నారు.