సిటీబ్యూరో, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కొరడా ఝులిపిస్తోంది. మూడు మునిసిపాలిటీల పరిధిలోని 10 అక్రమ నిర్మాణాలను గురువారం కూల్చివేశారు. జల్పల్లిలో 6, పెద్ద అంబర్పేటలో 3, దుండిగల్లో 1 చొప్పున అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. గతంలో దుండిగల్ మునిసిపాలిటీ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, వాటిలో ఒక నిర్మాణాన్ని తిరిగి నిర్మిస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్, హెచ్ఎండీఏ డైరెక్టర్, దుండిగల్ మునిసిపల్ కమిషనర్లు స్వయంగా పరిశీలించి అక్రమ నిర్మాణం పిల్లర్లను దగ్గరుండి కూల్చివేయించారు. ఇప్పటి వరకు మొత్తం 143 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.