ఇచ్చోడ, మే 11 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను, మంత్రి పదవి నుంచి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ సోమవారం ఇచ్చోడలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ చేసి 3 రోజులైనా అరెస్టు చేయరా ? అని ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదురొనే వ్యకిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సదరు వ్యక్తిని పిలిపించి విచారిస్తారన్నారు. కానీ బండి భగీరథ్ కేసు వ్యవహారంలో పోలీసులకు చూపిస్తున్న ఉదాసీనత సామాన్యులపై మాత్రం కనిపించదన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీజేపీ కలిసి బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు పాండురంగ్, నర్వాడే రమేశ్, సర్పంచ్‌లు అల్తాఫ్, ఆజిజ్, ప్రవీణ్, సాబీర్, ప్రవీణ్, గణేశ్, లక్ష్మి, సుభాష్ పాల్గొన్నారు.
సిరికొండలో..
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సిరికొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విక్రమ్‌కు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటన్న, మాజీ ఉప సర్పంచ్ చందు, బీఆర్ఎస్ నాయకులు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
బోథ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
బోథ్, మే 11 : పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బోథ్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, మే 11 : బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని నేరడిగొండ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, స్థానిక సర్పంచ్ ఎలేటి నీలిమా రవీందర్‌రెడ్డి, వడూర్ సర్పంచ్ శ్రీకాంత్, నాయకులు రాథోడ్ రవీందర్, సుజిల్, అశ్మత్, శ్రీనివాస్‌రెడ్డి, కైలాస్ పాల్గొన్నారు.