మహబూబ్‌నగర్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి కారును అతి వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబ్‌నగర్ యూబీ గార్డెన్లో ఓ ఫంక్షన్‌కు జిల్లా కేంద్రంలోని మర్లు ప్రాంతానికి చెందిన వారు హాజరై తిరిగి కారులో బయలుదేరారు. అర్ధరాత్రి సమయంలో బైపాస్ రోడ్డులోని పాలకొండ వద్ద కారు యూటర్న్ తీసుకుంటుండగా.. క్రిస్టియన్‌పల్లి వైపు నుంచి అతివేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ రైడర్ ఢీకొన్నాడు. దీంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది.
కారులో ఉన్న పాలమూరుకు చెందిన సారాబేగం (30), అబ్దుల్ (2), అహ్మద్ (8), హైదరాబాద్‌కు చెందిన బైక్ నడుపుతున్న మహమ్మద్ ఓవైస్ (30)తోపాటు వెనుక ఉన్న అఫ్జల్ యాకూబ్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. కారులోని రేష్మ, గౌసియాకు తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా బైపాస్‌లో హైదరాబాద్‌కు చెందిన 22 మంది బైక్ రేసర్లు ఓవర్ స్పీడ్‌తో బెట్టింగ్ నిర్వహించి బైకులు నడిపినట్టు ప్రాథమికంగా తేలింది. రైడర్లంతా హైదరాబాద్‌కు చెందిన ఉన్నత వర్గాల కుటుంబ సభ్యులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన గంటలోనే కొంతమంది పోలీసు అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి.. బైక్ రైడర్లపై కేసులు వద్దని బేరసారాలకు దిగడం సంచలనం కలిగిస్తున్నది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జిల్లా దవాఖానకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం కోల్పోయిందని.. బాధితులకు రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.