(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, దుబారా ఆపి ప్రజలందరూ దేశభక్తిని చాటుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చేసిన ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్, వంట నూనెల వినియోగం తగ్గించాలని చెప్తూ మోదీ చేసిన 9 సూచనలపై సామాన్యుల నుంచి ఆర్థిక రంగ నిపుణుల వరకూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. 12 ఏండ్ల పాలనలో దేశ ఆర్థికాన్ని సంక్షోభంలోకి నెట్టిన వాళ్లు ఇప్పుడు ఉచిత సలహాలు ఇవ్వడమేంటని రాజకీయ విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. పన్ను ఎగవేతలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల గురించి ఒక్కమాట కూడా మాట్లాడని మోదీ.. త్యాగాలు చేయాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు పిలుపునివ్వడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తయ్యాక, సంక్షోభం గురించి మోదీకి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని సోషల్‌మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మోదీ చెప్పిన సలహాలు అదానీ, అంబానీలకు వర్తిస్తాయా? లేదా? అని నిలదీస్తున్నారు. దేశ భవిష్యత్తు ముసుగులో ప్రజలపై పరోక్షంగా ఆంక్షలు విధించడమేంటని పలువురు మోదీ సర్కారును తూర్పారబడుతున్నారు.
గెలిస్తే మా వల్ల.. ఓడితే మీ వల్ల
‘విక్టరీ ఈజ్ క్లెయిమ్డ్.. డిఫీట్ ఈజ్ బ్లేమ్డ్’ అనే తీరులో మోదీ ప్రభుత్వ వైఖరి ఉన్నదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయం లభిస్తే అదంతా తమ గొప్పేనని చెప్పుకొనే వాళ్లు.. పరాజయం ఎదురైతే మాత్రం ఆ నెపాన్ని ఇతరులపై నెట్టివేస్తారంటూ గుర్తు చేస్తున్నారు. ఆదివారం కొనసాగిన మోదీ ప్రసంగం ఇలాగే సాగినట్టు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నాలుగో స్థానానికి చేరుకొన్నదంటూ 2024లో కొన్ని నివేదికలు చెప్పాయి. దేశ ప్రజల ఉత్పాదకత (జీడీపీ) పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతుంది. అంటే అది ప్రజల శ్రామిక విజయం. కానీ, దాన్ని పక్కనబెట్టిన బీజేపీ పరివారం అదంతా తమ గొప్పేనంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు బీజేపీ అసమర్థ పాలన, విధానపరమైన వైఫల్యాల కారణంగా దేశ ఆర్థికం సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. కానీ, దాన్ని కప్పిపుచ్చుకొంటున్న కేంద్రం పెద్దలు.. ప్రజలు దుబారా ఖర్చులు, విదేశీ వస్తువులు వాడటం వల్లే దేశ ఆర్థికం క్లిష్ట పరిస్థితుల్లోకి చేరుకొన్నదని అబద్ధాలు వల్లె వేస్తున్నారంటూ ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు.
అదానీ, అంబానీలను అడుగుతారా?
దేశ ఆర్థికాన్ని గాడిలో పెట్టడానికి ప్రజా రవాణాను వినియోగించాలని, బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు నిలిపేయాలంటూ దేశ ప్రజలకు మోదీ సూచించారు. దీనిపై ఆర్థికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవే సూచనలను అదానీ, అంబానీలకు మోదీ చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. కరువు తాండవించినప్పుడు, సంక్షోభ సమయాల్లో మైసూర్ మహారాజు కృష్ణరాజా వడియార్ వంటి వారు తమ ఖజానా నుంచి ప్రభుత్వానికి పెద్దయెత్తంలో సాయం చేశారు. జంషెడ్ జీ టాటా, హెన్రీ ఫోర్డ్ వంటి వ్యాపారులు కూడా ప్రభుత్వాలను ఆర్థికంగా ఆదుకొన్న ఘటనలు కోకొల్లలు. ఈ విషయాలను గుర్తు చేస్తున్న మేధావులు.. 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన అదానీ, అంబానీలు దేశ ఆర్థికానికి సాయపడి తమ దేశభక్తిని చాటుకోవచ్చు కదా! అంటూ సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రధాని వారికి ఎందుకు విజ్ఞప్తి చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలు ముగియగానే..
పశ్చిమాసియా యుద్ధం కారణంగానే దేశంలో సంక్షోభం తలెత్తినట్టు మోదీ చెప్తున్నారని, నిజానికి ఆ ఉద్రిక్తతలు ప్రారంభమై 70 రోజులు గడిచాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇన్ని రోజులు గుర్తుకురాని సంక్షోభ విషయం ఇప్పుడే ప్రధానికి ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ముందే చెప్తే, 5 రాష్ర్టాల ఎన్నికల్లో ప్రతికూలత ఏర్పడుతుందని గ్రహించే.. ఎన్నికలు ముగిశాక మోదీ సంక్షోభంపై తీరిగ్గా ఇప్పుడు ప్రకటన చేశారని చెప్తున్నారు. బీజేపీ పెద్దల వైఖరి ‘బనియన్ మే ఛేద్’ చందంగా ఉన్నదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. లోపల బనియన్‌కు ఉన్న రంధ్రాలు బయటకు కనిపించకుండా సూటుతో కవర్ చేసినట్టు.. దేశ ఆర్థిక సంక్షోభాన్ని మోదీ పరీవారం ఇన్నాండ్లూ ‘వికసిత్ భారత్’ పేరిట కవర్ చేసినట్టు ట్రోల్ చేస్తున్నారు.
రైటాఫ్‌లు, అప్పులు, పన్నుల సంగతేంటీ?
దేశ ఆర్థిక స్వావలంబన కోసం సామాన్యులకు పలు సూచనలు చేసిన ప్రధాని.. బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల గురించి ఎందుకు మాట్లాడటంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. గడిచిన పన్నెండేండ్ల రూ. 10 లక్షల కోట్లను బ్యాంకులు రైటాఫ్ చేసిన విషయాన్ని ఈ మేరకు ప్రస్తావిస్తున్నారు. జీఎస్టీ, వ్యాట్, ఎక్సైజ్, ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్.. ఇలా గడిచిన 12 ఏండ్లలో సామాన్యులపై మోదీ సర్కారు పన్నుపోటుకు తెగబడిందని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటివరకూ వివిధ పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు రూ. 350 లక్షల కోట్లు చేరినట్టు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో రుణాల పేరిట ఒక్కో దేశ పౌరుడిపై మోదీ సర్కారు రూ. 1.48 లక్షలను అప్పుగా చేసిందని, అలా మొత్తంగా దేశ అప్పులు రూ. 208 లక్షల కోట్లకు చేరుకొన్నాయని చెప్తున్నారు. మోదీ పాలనలోనే చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠాలకు రూపాయి విలువ పతనమయ్యిందని కూడా గుర్తు చేస్తున్నారు. ఇన్ని వైఫల్యాలను కప్పిపుచ్చుకొని.. ప్రధాని మోదీ ఇప్పుడు దేశ ఆర్థికంపై సామాన్యులకు హితబోధ చేయడమేంటని పలువురు నిలదీస్తున్నారు.
ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా?
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్. ఆయన ఓ నియంత. దేశ ప్రజలు ఏ రకమైన బట్టలు కట్టుకోవాలి? వాళ్ల హెయిర్ ైస్టెల్ ఎలా ఉండాలి? చివరకు ఇంట్లో ఏ వంట చేసుకోవాలి? అనే అంశాలను కిమ్ సర్కారే నిర్ణయిస్తుందని అంటారు. ఇప్పుడు మోదీ ప్రసంగాన్ని చూస్తే దాదాపుగా దేశంలో ఇవే పరిస్థితులు తలెత్తాయా? అనే అనుమానం కలుగుతున్నదని నెటిజన్లు వాపోతున్నారు. బంగారం కొనొద్దని, విదేశీ టూర్లకు వెళ్లొద్దని, వంట నూనె తగ్గించాలని, యూరియా వాడకం కుదించాలని, నెలవారీ సరుకుల లిస్టుకు కోత పెట్టాలని మోదీ చేసిన సూచనలు.. నియంతృత్వానికి పరాకాష్ఠగా మారాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిబంధనలు ఏమిటని మోదీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
మోదీ పాలనలో ఆర్థిక సంక్షోభం ఇలా..రూపాయి పతనం
ఒక్కో నెత్తిపై అప్పు
విదేశీ రుణాలు (బిలియన్ డాలర్లు)
దిగుమతులు (బిలియన్ డాలర్లు)
నిరుద్యోగిత రేటు