Delhi Woman : ఢిల్లీ పరిధిలో ఇటీవల వరుసగా నేరాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఒక మహిళను దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. రచనా యాదవ్ (44) అనే మహిళ తలపై కాల్చి చంపడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. రచనా యాదవ్ ఒక మీటింగ్ ముగించుకుని వస్తుండగా ఇద్దరు బైకుపై ఆమె వద్దకు వచ్చి, ఆమె పేరు అడిగారు. తన పేరు రచనా యాదవ్ అని చెప్పగానే ఆమె తలపై కాల్చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. నిందితులు ఆమె కదలికలపై ముందునుంచి నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. ఆమె భర్త విజేంద్ర యాదవ్ 2023లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఘటనకు రచనా యాదవే ప్రధాన సాక్షి. తను సాక్షిగా ఉన్న కారణంగానే ఆమెను దుండగులు కాల్చి చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విజేంద్ర హత్య కేసులో పోలీసులు ఆరుగురిని నిందితులుగా గుర్తించారు. వీరిలో ఐదుగురు అరెస్టయ్యారు. ప్రధాన నిందితుడు భరత్ యాదవ్ మాత్రం ఘటన జరిగినప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రచనా యాదవ్ భర్త విజేంద్ర యాదవ్ హత్యకు, ఈమె హత్యకు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రచనను హత్య చేస్తే విజేంద్ర కేసు నీరుగారుతుందని నిందితులు భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రచనా యాదవ్ స్థానికంగా ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తోంది. రచనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతురి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.