Mana Shankara Vara Prasad Garu | తెలుగు చిత్ర పరిశ్రమ డిజిటల్ మానిప్యులేషన్‌కు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటానికి సిద్ధమైంది. బాట్లు, ఫేక్ అకౌంట్ల ద్వారా సినిమాలపై కావాలని నెగటివ్ రేటింగ్‌లు ఇచ్చి, ఫలితాలను ప్రభావితం చేసే ‘డౌన్ రేటింగ్’ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు పరిశ్రమ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తున్న భారీ మల్టీస్టారర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో ఈ సరికొత్త నియంత్రణ విధానం అమలులోకి రానుంది.
కోర్టు ఆదేశాలతో డిజిటల్ మాఫియాకు చెక్
సినిమా విడుదలైన తొలి గంటల్లోనే కావాలని దుష్ప్రచారం చేస్తూ, వందల కోట్ల పెట్టుబడిని ప్రమాదంలో పడేస్తున్న అనైతిక శక్తులపై చిత్ర యూనిట్ న్యాయపోరాటం చేసింది. ఈ మేరకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో రివ్యూలు, రేటింగ్లను చట్టబద్ధంగా నియంత్రించాలని, కేవలం అసలైన ప్రేక్షకుల అభిప్రాయాలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేలా చూడాలని ఆదేశించింది. తద్వారా బాట్ల ద్వారా సృష్టించే ఆర్టిఫీషియల్ నెగటివిటీకి బ్రేక్ పడనుంది.
ఈ పోరాటంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏకంకాగా.. బ్లాక్‌బిగ్, ఐప్లెక్స్ సంస్థలు భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్తో కలిసి ఈ దిశగా ముందు అడుగు వేశాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ మార్పుకు పూర్తి మద్దతు ప్రకటించాయి. వేలమంది కార్మికుల శ్రమను, నిర్మాతల భారీ పెట్టుబడిని కాపాడటమే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని వారు స్పష్టం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 157వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, చిరంజీవి-వెంకటేష్ వంటి అరుదైన కాంబినేషన్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.