Masood Azhar : ఇండియాపై దాడి చేసేందుకు ఒకరిద్దరు కాదు.. వందలు కాదు.. వేల మంది మానవబాంబర్లు సిద్ధంగా ఉన్నారని పాకిస్తాన్ లోని ప్రమాదకర తీవ్రవాది మసూద్ అజార్ అన్నాడు. ఈ అంశంపై మసూద్ మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఆడియోలో మసూద్ ఇండియాపై దాడికి సంబంధించిన అంశాల్ని పంచుకున్నాడు.
‘‘ఆత్మాహుతి దాడులు చేసేందుకు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వంద మంది కాదు.. వెయ్యి మంది కూడా కాదు.. ఎంత మంది సిద్ధంగా ఉన్నారో చెబితే ప్రపంచ మీడియా హడలిపోతుంది’’ అని ఆ ఆడియోలో మసూద్ మాట్లాడాడు. తమ లక్ష్యం కోసం ఆత్మ బలిదానం చేయడానికి ఇప్పటికే ఎంతోమంది సిద్ధంగా ఉన్నట్లు మసూద్ తెలిపాడు. వారంతా దండేత్తేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించాడు. అయితే, ఈ ఆడియో ఎప్పటిది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఇది పాత ఆడియోనా.. లేక తాజాగా విడుదలైందా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే మసూద్ అజార్ 2019 నుంచి బయట కనిపించింది లేదు.
అతడు ఎక్కడున్నాడు అనే విషయంలో కూడా స్పష్టత లేదు. కాగా, మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాది. అతడు 2001లో ఇండియాలోని పార్లమెంటుపై జరిగిన దాడికి, అలాగే 2008 ముంబై దాడులకు సూత్రధారి. జైషే మహ్మద్ సంస్థను నడిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన పలు దాడులతో కూడా అతడికి సంబంధం ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు.