నీలగిరి, మే 12: మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేసే విషయంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొకజొన్న సేకరణపై మంగళవారం సీఎం హైదరాబాద్ నుంచి మంత్రులు, రాష్ట్రస్థాయి సీనియర్ అధికారులతో కలిసి కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సం బంధిత అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఇకపై జిల్లాలో ప్రతిరోజూ కనీసం 20 నుంచి 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. మిల్లుల వద్ద వచ్చిన ధాన్యం లారీలు, ఇతర వాహనాలను వెంటనే అన్లోడ్ చేయాలని, ఎలాంటి జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరైనా జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రేడ్ ఏ, కామన్ వెరైటీ రెండు కలిపి మిల్లులకు పంపించకుండా చూడాలని, ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎప్పటి ట్రక్ చీటీలు అప్పుడే తెప్పించుకోవాలని సూచించారు. మిర్యాలగూడ మిల్లుల్లో 1,34,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉందని, మిర్యాలగూడ రైసు మిల్లులపై ఎకువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. రానున్న 20 రోజుల్లో ప్రస్తుతం ట్రాన్స్పోర్టు చేస్తున్న లారీలు రొటేషన్ అయ్యేలా చూడాలని, లారీల సమస్యను అధిగమించేందుకు ట్రాన్స్పోర్టు అధికారులతోపాటు, సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు.
ధాన్యం ఎకువగా నిల్వ ఉన్న కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించే ఏర్పాటు చేయాలని,లారీ సమస్యల వల్ల మిల్లులకు ధాన్యం పంపే ప్రక్రియ ఆగకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో మరో 2 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ రైసు మిల్లుల వద్ద మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తే అవసరమైతే పోలీసు సహకారం అందిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో నల్లగొండ జిల్లా నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పౌర సరఫరాల డీఎం రాంపతి నాయక్, పౌర సరఫరాల అధికారి వెంకటేశం, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, డీసీవో పత్యా నాయక్, మారెటింగ్ ఏడీ ఛాయాదేవి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రవణ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.