నల్లగొండ రూరల్, మే 12 : ఆరుగాలం పండించి ధాన్యాన్ని రైతుల అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా నల్లగొండ నియోజకవర్గంలో మాత్రమే రెడ్డి కాలనీ, చందనపల్లి, దండంపల్లి, ఖాజీరామారం, శేషమ్మగూడెం, వెంకటాద్రిపాలెం, పెద్ద సూరా రం, గుండ్లపల్లి గ్రామాల్లో రైతు ఉత్పత్తుల సహకార సంఘం (మ్యాక్స్) కొనుగోలు కేంద్రాలు అధికార పార్టీకి చెందిన వారు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఆయా కొనుగోలు కేంద్రాల్లో అంతా గోల్ మాల్ వ్యవహారం నడుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో బస్తా తూకం 42.200 వేస్తుండగా మిల్లులకు వెళ్లిన ప్రతి లారీ లోడు నుంచి తరుగు, బియ్యం శాతం తక్కువగా ఉందనే సాకుతో సమారుగా 8 నుంచి 12 కిలోలు కటింగ్ చేస్తున్నారు.
ఇక్కడ మరో విషయం ఎంటంటే కనీసం రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కటింగ్ చేస్తూ.. మిల్లర్లు,కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కుమ్మక్కై పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కాంటా వేయగానే రైతులకు కొనుగోలు పత్రం ఇవ్వాలి. రైతుకు ఒకటి, బిల్లుకు ఒకటి, కొనుగోలు కేంద్రానికి ఒకటి చొప్పున ఇవ్వాల్సి ఉంది. మ్యాక్స్ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా ఇవి ఇవ్వడం లేదనే ఆరోణలు ఉన్నాయి. తరుగు పేరుతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు,మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు. కొనుగోలు పత్రం ఇస్తే ఆ ఆవకాశం ఉండదు. అదే విధంగా మ్యాక్స్ కొనుగోలు కేంద్రాల్లో అధికార పార్టీకి చెందిన వారి ధాన్యాన్ని మాత్రమే ఎలాంటి సీరియల్ లేకుండా కొనుగోలు చేస్తున్నారని పలువురు రైతుల ఆరోపిస్తున్నారు.
పెద్ద సూరారంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మూడు చోట్ల ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడే ఐకేపీ కొనుగోలు కేంద్రం ఉండటం, అధికార పార్టీలోనే రెండు వర్గాల ఉండటంతో వారు ఎవరి వర్గానికి చెందిన వారివి వారే కొనుగోలు చేస్తుండటంతో సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల దండంపల్లి కొనుగోలు కేంద్రంలోనూ లారీలు రావడం లేదని… లారీలు రావాలంటే బస్తాకు రూ. 3 నుంచి రూ.8 ఇవ్వాలని రైతుల నుంచి వసూలు చేశారు. దీనిపై విచారణకు వచ్చిన అధికారులు నామ మాత్రంగా విచారించి వెనుదిరిగారు. రెడ్డి కాలనీ, చందనపల్లి కొనుగోలు కేంద్రాల్లో తమకు నచ్చిన వారివి కాంటాలు వేయడం, పక్క గ్రామాలకు చెందిన తమ బంధువులైన వారివి కాంటాలు వేస్తున్నారని, తమవి నెల రోజులైనా వేడయం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
నేను పెద్ద సూరారంలో ఏర్పాటు చేసిన మ్యాక్స్ సెంటర్లో ధాన్యం పోసిన. ఏప్రిల్ 24న కాంటా వేశారు. నా ధాన్యం 333 బస్తాలుగా లెక్క తేలింది. తూకం కింద ఒక్కో బస్తా 42 కిలోలు వేశారు. నాతో పాటు ఐదుగురి రైతులతో కలిపి లోడు పంపించారు. మొత్తం 1057 బస్తాలు ట్రక్‌షీట్ రాసి మిల్లుకు పంపించారు. అయితే మాకు ఎలాంటి సమాచారం లేకుండా మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు మా అందరివీ కలిపి 19 బస్తాలు కటింగ్ చేసి మరో ట్రక్ షీట్‌ను క్రియేట్ చేసి బిల్లు చేశారు. ఈ విషయంపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం.
– పాలకూరి జానయ్య, రైతు, ఖాజీరామారం
రెడ్డి కాలనీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులైంది. సెంటర్ నిర్వాహకులు వారి బంధువులవి, చుట్టు పక్క గ్రామాల వారివి రాత్రికి రాత్రి కాంటాలు వేస్తుండ్రు. రైతులనే లారీలు తెచ్చుకోమంటుండ్రు. మళ్లీ హమాలీని తెచ్చుకోమని చెబుతుండ్రు. అలాంటప్పుడు కొనుగోలు కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయాలి. సీరియల్ ప్రకారం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సీరియల్ బుకింగ్ వంటివి ఏవీ లేవు. తక్షణమే అధికారులు స్పందించి కొనుగోళ్లు చేపట్టాలి.
-మేక రవీందర్‌రెడ్డి, రైతు, రెడ్డికాలనీ