హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో వర్తించే అదనపు హెచ్ఆర్ఏ కోసం కొందరు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డిప్యుటేషన్ గడువు ముగిసినా.. మళ్లీ గ్రేటర్‌లోనే పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. ఐదేండ్ల గడువు ముగిసినా బదిలీకాకుండా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అదనపు హెచ్ఆర్ఏను వదులుకోవాల్సి రావడంతో కదిలేందుకు అస్సలు ఇష్టపడటంలేదు. జనగణనను ఆసరా చేసుకొని రెండేండ్లపాటు మళ్లీ గ్రేటర్‌లోనే కొనసాగేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేసేందుకు 70 మంది అధ్యాపకులను డిప్యుటేషన్‌పై తీసుకున్నారు.
జీవో-42ను జారీచేసి.. ఐదేండ్ల కాల వ్యవధి కోసం వీరిని తీసుకున్నారు. ఐదేండ్ల గడువు డిసెంబర్ 2025తో ముగిసింది. దీంతో సర్కార్ వీరి జీతాలు కూడా నిలిపివేసింది. విద్యాసంవత్సరం మధ్యలో ఉండటంతో అధికారులు చొరవ తీసుకుని ఈ 70 మందిని పాతస్థానాల్లోనే కొనసాగించాలని నిర్ణయించారు. విద్యాసంవత్సరం ముగిసే వరకు లేదా.. సాధారణ బదిలీల్లో వీరిని బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఈ నెల 30తో డిగ్రీ విద్యాసంవత్సరం ముగియనున్నది. జనగణన డ్యూటీ ల పేరిట మెజారిటీ లెక్చరర్లు మళ్లీ పాత స్థానాల్లోనే పాగావేసేందుకు ప్రయత్నిస్తునారు.