హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజులుగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి చెరువులు, కుంటలు, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం లోటు వర్షపాతం నమోదవగా, తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో 5 శాతానికి తగ్గినట్టు తెలిపింది. తీవ్ర వాయుగుండం.. వాయుగుండంగా మారి పశ్చిమ వైపు వెళ్లిందని, ఇది తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం లేదని తెలిపారు. శని, ఆదివారాల్లో అకడకడ చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.