తిరుమల : కొంతకాలంగా తిరుమల ( Tirumala ) శ్రీవారి భక్తులను చిరుత పులులు ( Leopards ) భయాందోళనలకు గురి చేస్తున్నాయి. భక్తుల నడకదారులకు దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా మరోసారి అలిపిరి జూ పార్క్‌కు సమీపంలోనే చిరుత సంచరించింది. గురువారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ఫారెస్ట్ విభాగం ఏర్పాటు చేసిన ఇనుపకంచెను దాటి జూపార్క్ రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుంచి ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రి వరకు చేరుకుంది.
రోడ్డుపక్కనే ఉన్న చిరుత పులిని చూసిన భక్తులంతా భయంతో పరుగులు పెట్టారు. కాగా శుక్రవారం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద జింక కళేబరాన్ని స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత దాడిలో జింక మరణించినట్లు గుర్తించారు. చిరుత సంచారం దృష్ట్యా టీటీడీ భద్రతా సిబ్బంది భక్తులను అప్రమత్తం చేసింది. ఎస్పీ జూపార్కు నుంచి మొదటి కనుమ రహదారి వరకు పలు ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.