Kaleshwaram Project | నిజామాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారు తప్పనిపరిస్థితిలో తిరిగి అదే ప్రాజెక్టుపైనే ఆధారపడాల్సి వస్తున్నది. వర్షాభావ పరిస్థితులకు తోడు ఉన్న నీటి నిల్వలను ఇష్టానుసారంగా వాడటంతో నిజాంసాగర్‌లో నీటి వనరులు తగ్గిపోయాయి. ఆయకట్టు కింద నార్లు పోసుకునేందుకు అదును దాటుతుండడంతో నీటి విడుదల అనివార్యమైంది. దీంతో కేసీఆర్ రూపొందించిన కాళేశ్వరం పథకంలో భాగంగానే కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం జలాలను నిజాంసాగర్‌కు తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
లోటు వర్షపాతంతో ఆందోళన
వానకాలం మొదలై నెల రోజులు కావొస్తున్నా లోటు వర్షపాతంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కొట్టుమిట్టాడుతున్నది. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు ఈ ముప్పు తీవ్రంగా ప్రభావం చూపుతున్నది. ఎందుకంటే ఏటా జూన్ మొదటి వారానికే నాట్లు వేశారు. లక్షల ఎకరాలకు సాగు నీటి అవసరం ఏర్పడగా, నిజాంసాగర్‌లో నీటి నిల్వ ప్రమాదకరంగా మారింది. సాగుకు ఎలాగైనా నిజాంసాగర్ నీళ్లు ఇవ్వాలని రైతులు కోరుతుండటంతో చేసేది లేక పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే కలిసి కొండపోచమ్మ నీటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్‌కు రెండు టీఎంసీలు నీళ్లను తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రెండు టీఎంసీలకు అనుమతి వచ్చింది..
కొండపోచమ్మ సాగర్ నుంచి రెండు టీఎంసీల నీళ్లను నిజాంసాగర్‌కు తరలించేందుకు ఈఎన్సీ నుంచి అనుమతి వచ్చింది. ప్రస్తుతం నిజాంసాగర్‌లో మూడు టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆయకట్టు రైతుల అవసరాల రీత్యా కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్‌కు నీటిని తరలిస్తాం. నిజాంసాగర్‌కు వరద నీటి రాక మొదలైతే కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి తరలింపు ఉండదు. పరిస్థితు ల ఆధారంగా దీనిపై నిర్ణయం ఉంటుంది.
– శ్రీనివాస్, కామారెడ్డి సీఈ, ఇరిగేషన్ శాఖ