బడంగ్‌పేట : రాష్ట్ర పథకాల వల్ల జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indrareddy) నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రతి గడప గడపకు వివరించ వలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన పనులను వెంటనే ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారుల విస్తరణ పూర్తి కావస్తున్నాయనాన్నరు.
లింక్ రోడ్డులను అభివృద్ధి చేయనున్నాయని, ఇందుకు సంబంధించిన నిధులను ముఖ్య మంత్రి కేసీఆర్( CM KCR ), మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) సహకారంతో మంజూరు అయ్యాయని వివరించారు. సమీకృత మార్కెట్ల కోసం నియోజక వర్గవ్యాప్తంగా రూ,18.50 కోట్లు కెటాయించామని వెల్లడించారు. నియోజక వర్గంలో ఉన్న అన్ని గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంత్రాల చెరువు, పెద్ద చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేష్, డీఈ గోపినాథ్, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్ప, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, గజ్జల రాంచందర్, సిద్దాల బీరప్ప, అనిల్ కుమార్, నవీన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, తదితరులు ఉన్నారు.