ఉన్నతమైన ఉద్యోగం, మంచి జీవితం.. భార్య.. ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగిపోతున్న కుటుంబాన్ని అప్పుల భూతం బలితీసుకుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయి, కుటుంబ కలహాలతో క్షణికావేశంలో భర్త బలవన్మరణానికి పాల్పడగా.. భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేని ఇల్లాలు ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులతో కలిసి జలసమాధి అయింది. దీంతో నిత్యం సందడిగా ఉండే ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. అభం శుభం తెలియని చిన్నారులు విగత జీవులుగా మారడం అక్కడున్న వారి హృదయాలను కలిచివేసింది. ఈ హృదయ విదారక సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
అందోల్/రామచంద్రాపురం, డిసెంబర్ 3 : ఆర్థిక ఇబ్బందులతో సంగారెడ్డి జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యకు ఒడిగట్టింది. దీంతో బాధిత కుటుంబంలో పుట్టెడు దు:ఖం నెలకొన్నది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి. కొన్నేండ్ల క్రితం కుటుంబంతో బీహెచ్ఈఎల్కు వచ్చి ఎంఐజీ ఫేజ్-2 విద్యుత్‌నగర్, రోడ్డు నంబర్10లో స్థిరపడ్డాడు.
ఆయనకు ఇద్దరు కొడుకులు కాగా, పెద్ద కొడుకు అమెరికాలో ఉండగా, రెండో కొడుకు చంద్రకాంత్‌రావు (35) టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. చంద్రకాంత్రావుకు భార్య లావణ్య (33), తొమ్మిదేండ్ల బాబు ప్రతమ్, ఏడాది చిన్నారి సర్పజ్ఞ ఉన్నారు. అయితే, ఉద్యోగంతో పాటు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన చంద్రకాంత్రావుకు నష్టాలు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో, అల్లుడి బాధ చూడలేక మామ (లావణ్య తండ్రి) కొంత సాయం చేసినప్పటికీ అప్పులు తీరలేదు. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న పొలం కొంత విక్రయించి అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికి చంద్రకాంత్‌రావు తండ్రి ఒప్పుకోకపోవడంతో కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా వినకుండా అప్పులు చేస్తున్నాడని భార్య లావణ్య సైతం భర్తను నిలదీస్తూనే ఉండేది. దీంతో, తండ్రి, భార్య ఇద్దరూ తనను అర్థం చేసుకోవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం కూడా ఇంట్లో గొడవ జరగడంతో లావణ్య పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మరింత ఆవేదన చెందిన చంద్రకాంత్‌రావు.. ఇంట్లో బెడ్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విష యం తెలుసుకున్న ఆర్సీపురం పోలీసులు ఎంఐజీలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, పిల్లలను తీసుకుని బయటకు వచ్చిన లావణ్య మార్గమధ్యలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా..ఆమె భర్త మృతి చెందినట్లు చెప్పారు. దీంతో భర్తలేని జీవితం ఊహించుకోలేక గురువారం బస్సులో అందోల్ వరకు చేరుకుంది. రాత్రి సమయంలో పిల్లలను స్థానికంగా ఉన్న చెరువులో పడేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం చెరువు వద్దకు వెళ్లిన గ్రామస్తులకు లావాణ్య, చిన్నారుల మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మూడు మృతదేహాలకు బయటకు తీశారు. జోగిపేట ప్రభుత్వ దవాఖానలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలి సోదరి సౌజన్య ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు జోగిపేట సీఐ శ్రీనివాస్, రామచంద్రాపురం ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. కాగా, చంద్రకాంత్ తండ్రి కారణంగానే తన అల్లుడు, కూతురు, వారి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలు లావణ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు.