Death toll : ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) భూకంపం (Earthquake) మృతుల సంఖ్య 1400 దాటింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని కునార్ (Kunar), నంగర్హార్ (Nangarhar) ప్రావిన్స్‌లను కుదిపేసిన భూకంప నష్టాల వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూకంప విధ్వంసానికి ఊళ్లకుఊళ్లే మాయమైనట్టు తెలుస్తోంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకే పెరుగుతోంది. మరణాలు 1400 దాటగా, మూడు వేల మందికిపైగా గాయపడ్డారు. తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మానవతా సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. భూకంపంవల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి. దాంతో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకొనేందుకు చాలామంది చేతులతోనే మట్టిని తవ్వితీస్తున్నారు. మరోపక్క తాలిబన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. రాత్రి సమయంలో భూకంపం రావడంతో చాలామంది నిద్రలో ఉండటంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలామంది సజీవ సమాధి అయ్యారు. భూకంప కేంద్రం కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉంది.