Azerbaijan : షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పూర్తి సభ్యత్వం కోసం అజర్బైజాన్ (Azerbaijan) చేసిన ప్రయత్నాన్ని భారత్ (India) అడ్డుకుంది. ఈ చర్యపై అజర్బైజాన్ స్పందించింది. తాము పాకిస్థాన్ (Pakistan) తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్లే భారత్.. ప్రపంచ వేదికలపై తమను దెబ్బకొట్టిందని భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు సహకారం అందించినందుకే షాంఘై సహకార సంస్థలో పూర్తి సభ్యత్వం కోసం తాము చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుందని ఆరోపించింది. ఈ చర్యలు బహుపాక్షిక దౌత్య ఉల్లంఘనలేనని ప్రేలాపన చేసింది. అంతర్జాతీయ వేదికల్లో తమపై భారత్ ఎన్ని చర్యలు తీసుకున్నా తాము ఇస్లామాబాద్‌తో సంబంధాలు కొనసాగిస్తామని, అది తమ మిత్ర దేశమని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అధికప్రసంగం చేశారు.
రాజకీయంగా, సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా అజర్బైజాన్, పాకిస్థాన్ దేశాల మధ్య లోతైన బంధాలు ఉన్నాయని ఇల్హామ్ వ్యాఖ్యానించారు. చైనాలోని తియాన్జిలో ఇటీవల నిర్వహించిన షాంఘై సహకార సంస్థ సదస్సులో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో సమావేశమై.. ఇటీవల భారత్‌తో జరిగిన ఘర్షణల్లో విజయం సాధించారని పాక్ ప్రధానిని అభినందించారు. ఈ క్రమంలో ఎస్సీవోలో అజర్బైజాన్ పూర్తి సభ్యత్వానికి భారత్ అడ్డుతగిలింది.
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌తోపాటు, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించింది. ఆ సమయంలో అజర్బైజాన్ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతిచ్చింది. తుర్కియే కూడా బహిరంగ మద్దతు తెలిపింది. దాంతో ఆ రెండు దేశాలపై యమన దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.