Sheik Hasina | ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష పడింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరిపిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు.. షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు మరణ శిక్ష విధించింది.
గత ఏడాది జులై – ఆగస్టులో విద్యార్థుల నిరసనల అణచివేత సమయంలో దాదాపు 1400 మంది మృతిచెందారని ఐసీటీ న్యాయమూర్తి తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని చంపేయాలని షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఆగస్టు 5వ తేదీన ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని.. వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని షేక్ హసీనా ఆదేశించారని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు దర్యాప్తు నివేదికను వారు చదివి వినిపించారు.
ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హసీనా మద్దతుదారులు యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అప్రమత్తమైన బంగ్లా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కోర్టు తీర్పునకు ముందు షేక్ హసీనా ఖండించారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను హసీనా కొట్టిపారేశారు. ‘నేను 10 లక్షల మంది రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చాను. కానీ, వారు నన్ను మానవ హక్కులను ఉల్లంఘించానని ఆరోపిస్తున్నారు?’ అని అన్నారు. ఐసీటీ తీర్పుకు ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి హసీనా మాట్లాడారు. ఈ సందర్భంగా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యూనస్ ప్రభుత్వం తన పార్టీ అయిన అవామీ లీగ్‌ను పూర్తిగా నాశనం చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘మా పార్టీని నాశనం చేయడం అంత సులభం కాదు. అవామీ లీగ్.. అధికార దురాక్రమణదారుల జేబుల్లోంచి వచ్చిందికాదు. అట్టడుగు స్థాయి నుంచి పుట్టుకొచ్చింది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
అవామీ లీగ్ పాలనలో దోపిడీలు, నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా షేక్ హసీనా తెలిపారు. అయితే, ఇప్పటి తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నేరగాళ్లు హీరోలు అవుతున్నారని.. తనపై కుట్రలు పన్ని తప్పుడు కేసులు నమోదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రల వల్ల ఎంతో బాధతో తాను స్వదేశాన్ని వీడాల్సి వచ్చిందన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని ఈ సందర్భంగా తన మద్దతుదారులకు సూచించారు.
‘కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దు. నేను బతికే ఉన్నాను. బతికే ఉంటాను. మళ్లీ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తాను. బంగ్లాదేశ్ గడ్డపై న్యాయం చేస్తాను’ అని తెలిపారు. ‘తీర్పు రానివ్వండి. తీర్పు గురించి నాకు ఎలాంటి పట్టింపూ లేదు. నేను అలాంటి తీర్పులకు భయపడను. అల్లా నాకు జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకుంటాడు. కానీ నేను నా దేశ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను. నేను నా తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయా. వారు నా ఇంటిని తగలబెట్టారు’ అని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశం మొత్తం లాక్డౌన్ తీసుకురావాలని ఈ సందర్భంగా తన కార్యకర్తలకు హసీనా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన అవినీతిపరుడు, ఉగ్రవాది, హంతకుడు అంటూ ఆరోపించారు. యూనస్ అధికారాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. హంతకులకు యూనస్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందన్నారు.