న్యూఢిల్లీ: దశాబ్ద కాలానికి పైగా మూడేండ్ల చిన్నారి సహా 33 మంది మైనర్ల(బాలుర)పై లైంగిక దోపిడీకి పాల్పడినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజినీర్ రామ్ భావన్, అతని భార్య దుర్గావతి ఆ రాష్ట్ర ప్రత్యే క కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేరాలను అత్యంత అరుదైనవిగా పేర్కొన్న పోక్సో కోర్టు 2010 నుంచి 2020 మధ్య రామ్ భగవాన్, అతని భార్య దుర్గావతి బాలురపై లైంగిక దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించింది. ఇంటర్నెట్ ద్వారా దాదా పు 47 దేశాలకు రెండు లక్షలకు పైగా బాధితుల ఫోటోలు, వీడియోలను ఈ జంట పంపించినట్లు కోర్టు తెలిపింది.
అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీ(పోక్సో) ప్రదీప్ కుమార్ పోక్సో చట్టం నిబంధనల కింద నిందితులను దోషులుగా తేల్చారు. లైంగిక వేధింపులను తీవ్రతరం చేయడం, అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ఉపయోగించడం, పిల్లలతో కూడిన అశ్లీల కంటెంట్‌ని నిల్వ చేయడం, ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 33 మంది బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న నగదును బాధితులకు సమాన నిష్పత్తిలో పంపిణీ చేయాలనిప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.