దమ్మపేట రూరల్, జూలై 10: వ్యక్తి బతికుండగానే డెత్ సరిఫికెట్ జారీ చేశారు. ఆ వ్యక్తికి ఐదుగురు సంతానం ఉండగా ఒకే కూతురు ఉన్నట్లు ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ సైతం ఇచ్చారు. వీటి ఆధారంగా ఏజెన్సీలో కులాంతర భూమి రికార్డులను బదిలీ చేశారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దమ్మపేట మండలం, పెద్దగొల్లగూడెం పంచాయతీలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో నివసించే మళ్లా సత్యం 29-6-2018వ తేదీన మృతిచెందాడని, మరణాన్ని 31-6-2018న రిజిస్ట్రేషన్ చేసినట్లు డెత్ సర్టిఫికెట్లో పేర్కొన్నారు.
మళ్లా సత్యం భార్య పుల్లమ్మ గతంలోనే మృతిచెందగా.. సత్యం-పుల్లమ్మలకు నామా పుష్పవతి ఏకైక కుమార్తెగా పేర్కొంటూ 12-6-2025వ తేదీన ఆర్సీ.నం.బి/758/2026తో ఫ్యామిలీమెంబర్ సైతం సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ ఆధారాలతో భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న నామా పుష్పవతికి పెద్దగొల్లగూడెం రెవెన్యూలో సర్వే నంబరు 585/54లో ఐదు ఎకరాలకు పట్టాదారు పాస్ పుస్తకం నంబరు టీ27100060834, ఖాతా నంబరు 60527 లతో ట్రాన్‌శాక్షన్ నంబరు 2600301665 గత నెల 26వ తేదీన జారీ చేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లో మళ్లా సత్యం భార్య పుల్లమ్మ ఇంటిపేరు తాళ్ల అని నమోదు కావడం గమనార్హం. అయినప్పటికీ తహసీల్దార్‌తో సహా జీపీవో, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
మళ్లా సత్యం డెత్ సర్టిఫికెట్ నేను జారీ చేయలేదు. డెత్ సర్టిఫికెట్లో రాసింది నా చేతిరాతకాదు. నా సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారు. నాకూ ఆ సర్టిఫికెట్‌కు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆ డెత్ సర్టిఫికెట్ ఫార్మెట్ కరెక్ట్ కాదు.
– మహేందర్, పంచాయతీ కార్యదర్శి
పెద్దగొల్లగూడెం జీపీవో అనంతమ్మ నన్ను తప్పుదోవ పట్టించింది. నా సంతకంతోపాటు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరాస్వామి సంతకాన్ని సైతం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నివేదికలో ఫోర్జరీ చేసింది. ఈ విషయంపై కలెక్టర్ అంకిత్‌కు సీసీ ద్వారా సమాచారమిచ్చాను. సంతకాలను ఫోర్జరీ చేసినందుకు, పాస్‌పుస్తకాలు జారీలో తనను తప్పుదోవ పట్టించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తా.
– రాంనరేష్, తహసీల్దార్, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా