సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని ప్లాట్ల విక్రయానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నగరంలో విసృత్త ప్రచారం నిర్వహిస్తున్నది. 450 ఎకరాల్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులతో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం నగరంలో రియల్ రంగం ఊపందుకోవడంతో మూడు దశల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లలోని 44ప్లాట్లను ఆన్లైన్లోనే విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రచారం..
ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ప్రధాన ద్వారం వద్ద హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేకంగా కౌంటర్‌ను, ప్లాట్ల వివరాలతో కూడిన లేఅవుట్ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్, ఎస్టేట్, ప్లానింగ్ విభాగాలకు చెందిన సిబ్బంది విక్రయానికి ఉంచిన ప్లాట్ల వివరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారికి వివరిస్తున్నారు. అదేవిధంగా అమీర్‌పేటలోని మైత్రీవనం, స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ప్రాంగణంలోనూ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా నగరంలోని పలు చోట్ల హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు డిజిటల్ ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ వేలానికి సంబంధించి ఈనెల 15న ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 30వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు గడువు విధించారు. డిసెంబర్ 2, 3తేదీల్లో ఉదయం 9గంటల నుంచి ఆన్లైన్ వేలం ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.