ఘట్కేసర్, జనవరి 19: ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతరలో అపశ్రుతి చోటుచేసుకున్నది. డీసీఎం వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడటంతో రోడ్డుపై నడుస్తున్న.. అందులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆరు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. ఘట్కేసర్ అడ్మిన్ ఎస్సై బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్కేసర్ పట్టణంలోని బైపాసు రోడ్డు గట్టు మైసమ్మగుట్ట సమీపంలో నగరంలోని ఎన్టీఆర్నగర్కు చెందిన పోట్టొల్ల బాలయ్య కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి యాదగిరిగుట్ట దైవదర్శనానికి డీసీఎం(టీఎస్07 యుకే 3716) వ్యాన్‌లో వెళ్లి తిరిగి సాయంత్రం ఎన్టీఆర్నగర్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మైసమ్మగుట్ట జాతర ఉత్సవాలకు వచ్చిన భక్తులు, ప్రజలు రోడ్డుపై ఉండటంతో డీసీఎం డ్రైవర్ జంగయ్య చారి వ్యాన్‌ను ఆపేందుకు యత్నించగా బ్రేకులు పడలేదు. దీంతో డ్రైవర్ అప్రమత్తమై రోడ్డు పక్కన ఉన్న బైకులు, చెట్టును ఢీకొట్టి సర్వీస్ రోడ్డు వైపు మళ్లించగా.. అదుపు తప్పి వ్యాన్ గుంతలో పడింది. దీంతో రోడ్డు దాటుతున్న ఎదులాబాద్‌కు చెందిన మంజుల, చందన, విగ్నేష్, భవ్యశ్రీ, యశ్వంత్లతోపాటు వ్యాన్‌లోని రేణుక, మల్లమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 13 మందికి గాయాలయ్యాయి. 6 ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. భయభ్రాంతులకు గురైన డ్రైవర్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. బాధితులను ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానలో ప్రథమ చికిత్స చేయించి నగరంలోని యశోద దవాఖానకు తరలించారు. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Hyd11