హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేసవి రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైనట్టు వాతవారణశాఖ తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7 డిగ్రీ సెల్సియస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 37.6 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైనట్టు వెల్లడించింది. మరో 2 రోజులూ ఎండల తీవ్రత కొనసాగుతుందని, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని, కొన్నిచోట్ల 5 డిగ్రీలు అధికంగా కూడా రికార్డవ్వొచ్చని స్పష్టంచేసింది. జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.