Telangana | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): దావోస్‌లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా తెలంగాణ రాష్ర్టానికి రూ.56,300 కోట్ల పెట్టబడులకు సంబంధించిన ఒప్పందాలు బుధవారం జరిగాయి. వీటిలో సన్ పెట్రోకెమికల్స్ సంస్థ రూ.45,500 కోట్లతో రాష్ట్రంలో భారీ పంప్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అలాగే కంట్రోల్ ఎస్ డాటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ రూ.10 వేల కోట్లతో హైదరాబాద్‌లో అత్యాధునిక ఏఐ (కృత్రిమ మేథ) డాటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్.. హైదరాబాద్‌లో కొత్తగా టెక్ సెంటర్, రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్టు అమెరికాకు చెందిన జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రకటించాయి. ఇందుకోసం రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నది. తెలంగాణ ప్రభుత్వంలో కుదిరిన ఆయా ఒప్పందాల ద్వారా సుమారు 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.