హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ చరిత్రగానీ, ఇకడి ప్రగతి ప్రస్థానం గానీ తెలియని పొంగులేటి.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి చిల్లర జోతిష్యాలు చెప్పడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ‘పొంగులేటి.. కొత్తగా జోతిష్యం ఏమైనా నేర్చుకున్నావా? మా పొలిటికల్ ఫ్యూచర్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకెకడిది?’ అని ప్రశ్నించారు. త్వరలోనే కాంగ్రెస్ ప్ర భుత్వ అవినీతి లీలలన్నీ బట్టబయలై, జైలు ఊ చలు లెకబెట్టడమే పొంగులేటి భవిష్యత్తు అని జోస్యం చెప్పారు. పొంగులేటి చేస్తున్న అక్రమా లు, ఆయన వెనుక ఉండి నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా వల్ల మరో రెండేండ్ల్లలో ఆయ న స్థానం చర్లపల్లి జైల్లోనే ఉంటుందని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై మంత్రి పొంగులేటి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యల ను శనివారం ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక మెట్రోస్టేషన్ కూడా కట్టలేదన్న పొంగులేటి విమర్శలపై శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. ‘అధికార అహంకారంతో కండ్లు పూర్తిగా మూసుకుపోయాయా?
హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి మెట్రో ప్రాజెక్టును తెచ్చి, రికార్డు సమయంలో ఫేజ్-1 పూర్తి చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వం కాదా?’ అని నిలదీశారు. హైటెక్‌సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఫేజ్-2 ప్రణాళికలను సిద్ధం చేస్తే, ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దానిని రద్దు చేసిందని ఆరోపించారు. ఎల్ అండ్ టీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రాజెక్టులను అతలాకుతలం చేస్తున్నారని విమర్శించారు.
నాడు కేసీఆర్ ఉపాధి కల్పనే ధ్యేయంగా తెచ్చిన గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా సిటీని రద్దు చేసి, నేడు ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రి యల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని దాసోజు ధ్వజమెత్తారు. పేదలు, ఫ్యూచర్ సిటీ ముసుగులో వేల కోట్ల రూపాయల అవినీతి, ల్యాండ్ పూలింగ్ సామ్‌లకు తెరతీశారని, నాదర్గుల్, లగచర్లలో రైతులను బెదిరించి, అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హెచ్ఐఎల్టీపీ పాలసీ పేరుతో జరుగుతున్న ఇండస్ట్రియల్ మాఫియా దందాలన్నింటినీ త్వరలో ఆధారాలతో బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటిల భవిష్యత్తు ఇక జైళ్ల్లోనే ఉంటుందని దాసోజు స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావులు తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు రెండు కండ్లలాంటి వారని శ్రవణ్ పేరొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమకాలం నుంచి ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధపడిన కడిగిన ముత్యాల్లాంటి నాయకులని కొనియాడారు. తెలంగాణ చరిత్రపుటల్లో వారి పేర్లు సువర్ణాక్షరాలతో శాశ్వతంగా నిలిచిపోతాయని, అది వారి అజేయమైన భవిష్యత్తు అని దాసోజు శ్రవణ్‌కుమార్ స్పష్టంచేశారు.