హిమాయత్‌నగర్, మే 2: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజానాయకుడని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదర్శనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ను కవిత విమర్శించడం సరికాదని అన్నారు.
కవిత కలలు కనాలే తప్ప కబుర్లు చెప్పవద్దని ఎద్దేవా చేశారు. కవిత తన రాజకీయ స్వార్థం కోసం సొంత తండ్రిని విమర్శించడం తగదని హితవు పలికారు. తల్లిదండ్రులను గౌరవించలేని వాళ్లు ఏం మనుషులని ప్రశ్నించారు. కవిత ఇంటి సమస్యను బయటకు తీసుకువస్తున్నదని విమర్శించారు. మరో పదేండ్ల పాటు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాల్సిన కేసీఆర్‌ను కవిత తన మాటలతో మానసికంగా బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
ఈ ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని, ఎవరినీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. తాను ఓటు చోరీ బాధితుడినని, అందువల్లనే సికింద్రాబాద్ ఎంపీగా ఓడిపోయానని చెప్పారు.