భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం, మే 2 : సామాన్య ప్రజలపై ‘గ్యాస్ పిడుగు’ పడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనంపై మోయలేని భారం మోపింది. ఆరు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్‌పై ఒకేసారి రూ.993 పెంచడంతో సిలిండర్ ధర రూ.3,314కు చేరింది. ఈ ఏడాదిలోనే ఇప్పటికే ఆరుసార్లు గ్యాస్ ధరలు పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలతోపాటు విద్యార్థులు, వర్కింగ్ మెన్స్, ఉమెన్స్ హాస్టళ్లు, వలస కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. కొందరు వ్యాపారులు హోటళ్లను మూసివేసిన దుస్థితి దాపురించింది.
ఇటు గృహ వినియోగ సిలిండర్(డొమెస్టిక్ ఎల్పీజీ)పైన సైతం కఠిన నిబంధనలు విధించడంతో గ్యాస్ దొరకక నిరుపేదలు విలవిలలాడుతున్నారు. గ్యాస్ బండలను మూలనపడేసి అటు వాణిజ్య, ఇటు గృహ వినియోగదారులు కట్టెల పొయ్యిలే వాడుకుంటున్నారు. సామాన్యుడి బతుకులను ఛిద్రం చేస్తున్న మోదీ సర్కార్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ వెలిగిపోతోందని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను మాత్రం పీల్చిపిప్పి చేస్తున్నది. వారిపై మోయలేని భారాలు మోపుతూ నానాటికీ కుంగదీస్తున్నది. దేశంలో ఎక్కడా పొగ కనబడకూడదు.. పొగరహిత సమాజం కావాలి.. పదేపదే చెప్పిన మోదీ సర్కార్ మళ్లీ పాతరోజులనే తలపించేలా కట్టెల పొయ్యిలతో గ్రామాలను పొగమయం చేస్తున్నది. యుద్ధం పేరుతో గ్యాస్ కొరతను సృష్టించి గత నెలరోజులుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ కనిపిస్తున్నది. గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు ఖాళీ బండలతో నిత్యం వేచిచూడాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో సామాన్య జనం గ్యాస్ పొయ్యిలను పక్కన పెట్టి కట్టెల పొయ్యిల వినియోగానికి వచ్చేశారు. అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకొని వంటలు చేసుకుంటున్నారు. ఇక హాస్టళ్లలో పిల్లల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నిన్న మొన్నటివరకు సెలవులు వచ్చినా నెలరోజులపాటు వారు పడిన అవస్థలు వర్ణణాతీతం.
హోటళ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గ్యాస్ దొరకకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపైనే వంటలు వండుతున్నారు. గ్యాస్ ధరలు పెంచడంతో ఇక కొనలేమని నిర్ణయించుకున్నారు. రోడ్ల మీద తోపుడుబండ్లపై విక్రయాలు చేసుకునే ఇడ్లీ నిర్వాహకులు గ్యాస్ కొనలేక చేతులెత్తేశారు. చాలా బండ్లు అడ్రస్ లేకుండా పోయాయి. రోడ్లపై కట్టెలు పెట్టుకుని వండుకోవాలంటే కుదరదు కాబట్టి వ్యాపారాలకు గుడ్‌బై చెప్పేశారు. కేవలం మూడు నెలల్లోనే వాణిజ్య గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగాయి. మార్చి నెలలో రూ.2,069 ఉన్న బండ రూ.2,281 పెరిగింది. ఏప్రిల్‌లో రూ.2,281 ఉన్న బండ రేటు రూ.2,301కి పెరిగింది. మే నెలలో రూ.2,301 ఉన్న బండ రేటు ఒక్కసారిగా రూ.3,274కు పెరిగింది.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థల నుంచి డొమెస్టిక్, కమర్షియల్ అవసరాలకు వినియోగదారులు గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. దీనిలో డొమెస్టిక్ కనెక్షన్లు ఐఓసీఎల్-96,008, బీపీసీఎల్-1,50,881, హెచ్‌పీసీఎల్-1,00,125 మొత్తం 3,47,014 కనెక్షన్లు, వాణిజ్య కనెక్షన్లు ఐఓసీఎల్-120, బీపీసీఎల్-894, హెచ్‌పీసీఎల్-67 కనెక్షన్లు మొత్తం 1,081 వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రెండు రకాలు కలిపి 3,48,095 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో మూడు సంస్థలు కలిపి 25 మంది డీలర్లు ఉన్నారు. ఈ సంస్థల ద్వారా ప్రతిరోజు డొమెస్టిక్, వాణిజ్య అవసరాలకు సగటున 4,537 సిలిండర్లు డెలివరీ చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఆయా గ్యాస్ ఏజెన్సీల దగ్గర కేవలం 7,380 సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు ప్రస్తుతం 3,013 సిలిండర్లు మాత్రమే డెలివరీ చేస్తున్నాయి. ఒక్కో వినియోగదారుడు ఆన్లైన్ గ్యాస్‌ను బుక్ చేసుకుంటే సగటున 13 రోజుల తర్వాత వారికి గ్యాస్ సిలిండర్ చేరుతున్నది.
భద్రాద్రి జిల్లాలో హెచ్‌పీ, భారత్, ఇండేన్ కంపెనీలు మొత్తం 27 ఏజెన్సీల ద్వారా 4.26 లక్షల వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. ఇందులో 4,585 మంది కమర్షియల్ గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఉన్నట్టుండి వాణిజ్య గ్యాస్ బండల ధరలు పెంచడంతో ఒక్కసారిగా వ్యాపారులపై గ్యాస్ పిడుగు పడింది. దీంతోపాటు సామాన్య జనాలకు సైతం బుకింగ్ గ్యాప్ పెంచడంతో నెలల తరబడి గ్యాస్ దొరకకపోవడంతో గ్యాస్ బండలను మూలకు పడేయాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరు వ్యాపారం చేసినా కుటుంబాలు గడవడానికి చేస్తారు.. కానీ, అప్పుల పాలవడానికి కాదు కదా. ఇప్పుడు గ్యాస్ రేట్లు చూస్తుంటే హోటల్ వ్యాపారాలు మూసేసి బోర్డు తిప్పుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇంత దారుణంగా గ్యాస్ రేట్లు ఎప్పుడూ పెరగలేదు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలూ పెరిగాయి. గ్యాస్ రేట్లు కూడా పెంచితే హోటళ్లు ఎలా నిర్వహించాలి.
-గోపి, హోటల్, యజమాని, కొత్తగూడెం
అసలే ఎండాకాలం.. కట్టెలు పెట్టి వంటలు చేస్తే ఆ పొగకు చుట్టుపక్కల జనం ఉండలేరు. కానీ, తప్పని పరిస్థితుల్లో వంట చేయాల్సి వస్తున్నది. కట్టెలు కూడా చాలా రేటు ఉన్నాయి. అడవిలో చెట్లు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు కట్టెలు దొరకాలంటే అది కూడా గ్యాస్ కంటే రేటు ఉన్నాయి. వ్యాపారాలు చేయలేం. చాలా ఇబ్బంది అవుతున్నది. పనిచేసే వారు కూడా కట్టెల పొయ్యిలు అంటే రావడం లేదు.
-లక్ష్మీదుర్గ, హోటల్ నిర్వాహకురాలు, కొత్తగూడెం
గతంలో గ్యాస్ బుక్ చేస్తే వెంటనే ఇంటికి డెలివరీ చేసేవారు. ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే వారం రోజుల తర్వాత ఇస్తున్నారు. డెలివరీ బాయ్‌లు ప్రతిరోజూ రావడం లేదు. ఆఫీసుకు వెళ్లి అడగాల్సి వస్తున్నది. మళ్లీ 45 రోజుల వరకు గ్యాస్ బుకింగ్ కాకపోతే వంటకు చాలా కష్టమవుతున్నది. బంధువులు వచ్చినప్పుడు గ్యాస్ త్వరగా అయిపోతుంది. అప్పుడు ఎవర్ని అడిగినా గ్యాస్ ఇచ్చే పరిస్థితి లేదు. హోటల్ నుంచి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
-పయ్యావుల స్వరూపరాణి, గృహిణి, కొత్తగూడెం
గ్యాస్ కొరత వల్ల హోటల్ నడపలేక మూసేశాను. వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.వెయ్యి పెరిగి రూ.3,300 అయ్యింది. కట్టెలపొయ్యి మీద వర్కర్లు పని చేయలేకపోతున్నారు. వంట చెరుకు కూడా రూ.వెయ్యి పెరిగింది. మొన్నటివరకు ఆటో లోడు రూ.1,500 ఉండగా గ్యాస్ కొరతతో రూ.2,500 పెంచారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు కొని హోటల్ నడపటం సాధ్యం కావటం లేదు. ప్రభుత్వం వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి.
-మేచినేని గిరిధర్, టీ స్టాల్ ఓనర్, అశ్వారావుపేట