చం॥ మిసిమి పసిండిమైతళుకు మించులు సంచలదంబరాంచలా
వసధము మాటుదాటి వెలివచ్చిపడం గనుగుట్టునట్టి మే
ల్పసగల రంగురూపులకు బమ్మయు రిమ్మగొనన్ త్రిభంగి మే
నెసగనొయార మొల్కగ నటేశుని యాకృతి గూర్చి మ్రొక్కిడెన్
ఈ పద్యం అభినవ పోతన శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల భోగినీలాస్యం నుంచి తీసుకున్నది. వారు రచించిన పోతన చరిత్రములోని భోగినీ నృత్య ఘట్టం దాదాపు 71 పద్యాలలో, రాగ తాళ గేయాలతో నిండి ఉంటుంది. ఆ సరళి ఆచార్యుల సంగీత నృత్య వైదుష్యాన్ని కనుల ముందు ఆవిష్కృతం చేస్తుంది.
ఈ పద్యం విషయానికి వస్తే.. భోగిని నాట్యం ప్రారంభిస్తూ ముందుగా నటేశుని ఆకృతి అభినయించింది. ఆ సమయంలో ఆమె హావభావాలు వర్ణిస్తున్నారు కవి. సువర్ణదేహ విలసల్లీలావిలాసమ్ము మిలమిల మెరుస్తూ పసిడి కాంతులను మించి వలిపెంపు వలువను దాటి బయటికి వచ్చి బ్రహ్మ దేవునికే మత్తెక్కిస్తున్నాయట. ఇక్కడ కవిగారు వారి వ్యాఖ్యానంలో అయితే చెప్పుకోలేదు గానీ, దిక్కులే వస్ర్తాలుగా గల దిగంబరుడు శంకరుడే కదా! అతనే నాట్యాచార్యుడు, నటరాజు. అందుకే..
‘ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాఙ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్త్వికం శివం’ అంటూ భక్తి పారవశ్యంతో నమస్కరించింది. ఈ శ్లోకం ‘చతుర్విధ అభినయాలైన ఆంగిక వాచిక ఆహార్య సాత్త్విక అభినయాలు తెలుపుతూనే ధ్వనిగా ఎవరి శరీరం భువనమో, ఎవరి వాక్కు సర్వ వాఙ్మయమో, తారాచంద్రులు ఎవరికి ఆహార్యమో ఆ సాత్త్వికుడైన శంకరునికి నమస్కరిస్తున్నాను’ అని ఆచార్యుల స్వవ్యాఖ్యానం మహేశ్వరుని తాండవాన్ని వివరించింది. శివుడు తాండవ లాస్యాలకు ఆది గురువు. ఈ తాండవం ఏడు విధాలు. ఆనంద తాండవం, సంధ్యా తాండవం, కలిక తాండవం, విజయ తాండవం, ఊర్ధ్వ తాండవం, ఉమా తాండవం, సంహార తాండవం అని.
నృత్త, నృత్య, నాట్యాలు మూడూ భరతముని గ్రధితాలు. నృత్తం కేవలం అవయవ చలనంతో కూడినది. ఇది నేత్ర, భ్రూ, ముఖ, హస్త, భుజ, వక్షోజ, కటి పాదాంగుళుల చాలనం; నృత్తానికి గాన పాఠ్య వ్యక్తీకరణం అమరిన అది నృత్యమవుతుంది. నాట్యం కేవలం రసాశ్రయం. నృత్తనృత్యాలకు భావరాగ తాళాలు అవసరం. నాట్యం ఇవేవీ లేకుండా కూడా అభినయించవచ్చు. అలా సమ్మోహనమైన తన నృత్య కళా వైభవాన్ని నటేశునికి నమస్కరించడంతో ప్రారంభించింది భోగిని. మనోహరమైన పద్యాలతో రాగతాళ యుక్త గేయాలతో అద్భుతంగా ఆచార్యులు రచించిన ఘట్టం ఇది.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ