Singapore Open : గత సీజన్ నుంచి అంతర్జాతీయ టోర్నీలో దుమ్మురేపుతున్న సాత్విక్ సాయిరాజ్(Satwik Saijraj) – చిరాగ్ శెట్టి (Chirag Shetty) ద్వయం చరిత్ర సృష్టించింది. ఏళ్లుగా భారత డబుల్స్ క్రీడాకారులను ఊరిస్తున్న సింగపూర్ ఓపెన్ ట్రోఫీని ఈ జోడీ గెలుపొందింది. ఆదివారం ఫైనల్లో టాప్ గేర్‌లో ఆడిన భారత జంట ఫైనల్లో ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా)ను మట్టికరిపించి టైటిల్‌ను కొల్లగొట్టింది. తద్వారా రెండేళ్లలో రెండో ట్రోఫీని సాధించింది సాత్విక్ – చిరాగ్ జోడీ.
థామస్ కప్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం సింగపూర్ ఓపెన్ సూపర్ 750 పురుషుల డబుల్స్‌లో ట్రోఫీని పట్టేసింది. సెమీస్‌లో వరల్డ్ నంబర్ 1 జోడీ కిమ్ వాన్ హొ – సియో సెయంగ్ జీ(దక్షిణ కొరియా)ని 52 నిమిషాల్లోనే ఓడించిన భారత జంట ఫైనల్లోనూ పంజా విసిరింది.
SATCHI ARE THE CHAMPIONS OF BWF SINGAPORE OPEN 2026 ❤️🏆#SingaporeOpen2026 https://t.co/bYmk2NWHoD pic.twitter.com/DQCoRSQVmS
— Badminton Media (@BadmintonMedia1) May 31, 2026
ఇండోనేషియా షట్లర్లు ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ తొలి సెట్‌ను గెలుచుకున్నా పట్టువదల్లేదు సాత్విక్ – చిరాగ్. రెండో సెట్లో 21-17తో ప్రత్యర్థికి షాకిచ్చిన భారత జోడీ.. నిర్ణయాత్మక మూడో సెట్‌ను 21-16తో అలవోకగా గెలుచుకుంది. అంతే.. సింగపూర్ ఓపెన్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన భారత జంటగా సాత్విక్ – చిరాగ్ రికార్డు నెలకొల్పారు.
BWF Singapore Open 2026
MD Final🥇🇮🇳 Satwiksairaj Rankireddy / Chirag Shetty
🥈🇮🇩 Fajar Alfian / Muhammad Shohibul Fikri#SingaporeOpen2026 https://t.co/NQKa9jMv3u pic.twitter.com/dSrtNC81sg— Badminton Media (@BadmintonMedia1) May 31, 2026
‘ఫైనల్లో మేము తరచూ ఓడిపోయేవాళ్లం. కానీ, ఈ టోర్నమెంట్ మాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరంతా ఆటపై ఎంతో ఇష్టం చూపించారు. ఏ దేశం క్రీడాకారులు అనే విషయం పక్కనపెట్టి.. ప్రోత్సహించారు. బ్యాడ్మింటన్ ఆడేందుకు ఇంతకంటే ఉత్తమమైన స్టేడియం ఇంకొకటి ఉండదని అనుకుంటున్నాం’ అని మ్యాచ్ అనంతరం కోర్టులో సాత్విక్ – చిరాగ్ వెల్లడించారు.